మోహన్ బాబు.. నాలుగు దశాబ్దాల ప్రయాణం. నటుడిగా, నిర్మాతగా.. ఆయన చూడని హిట్ లేదు. ఇప్పుడంటే ట్రోలర్స్ కి ముడిసరుకుగా మారారు గానీ, ఇది వరకు సూపర్ హిట్లు కొట్టిన ఘనత ఉంది. అయితే కొంతకాలంగా ఆయనకు సరైన సినిమా పడలేదు. నటుడిగా, నిర్మాతగా ఫెయిల్యూర్స్ చవి చూస్తున్నారు. చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగానే ఉన్నారు. మధ్యలో `సన్నాఫ్ ఇండియా` ప్రయోగాత్మకంగా తెరకెక్కించారు కానీ, ఆ సినిమా దారుణంగా ట్రోల్ అయిపోయింది. అందుకే ఇప్పుడు సినిమా తీయాలంటే.. ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు మోహన్ బాబు ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే ఇది రీమేక్. మలయాళంలో విమర్శకుల ప్రశంసలు పొందిన ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25` చిత్ర హక్కుల్ని మంచు విష్ణు సొంతం చేసుకొన్నారు.ఈ సినిమాని తెలుగులో మోహన్ బాబుతో చేయాలన్నది ఆలోచన. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. కొడుకు పాత్రలో… ఓ యువ హీరో నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులూ చేస్తున్నారు. దర్శకుడి పేరు త్వరలోనే ప్రకటిస్తారు.