మంచు ఫ్యామిలీలో కత అంతు లేని కథలా ఆస్తుల పంచాయతీ నడుస్తోంది. తన ఆస్తుల నుంచి మనోజ్ ను ఖాళీ చేయించాలని మోహన్ చేసిన ఫిర్యాదు మేరకు మేజిస్ట్రేట్ హోదాలో రంగారెడ్డి కలెక్టర్ ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ ఎదుట హాజరైన ఇద్దరూ ఆమె ముందే తిట్టుకున్నారు. తీవ్రంగా వాగ్వాదానికి దిగి ఘర్షణపడే పరిస్థితి రావడంతో పోలీసులు సర్ది చెప్పారు. ఇలాంటి ఘర్షణలు ఇక్కడ పడకూడదని చెప్పారు. దాంతో వారు తీవ్ర వాగ్వాదంతో సరి పెట్టుకున్నారు. పంచాయతీ కుదరకపోవడంతో వచ్చే వారం రావాలని ఇద్దరికీ చెప్పి పంపేశారు కలెక్టర్.
సింపుల్ గా అయిపోవాల్సిన విషయాన్ని చింపి చేటంత చేసుకుని ఇప్పుడు చేపంత చేసుకున్నారు తండ్రీ కొడుకులు. ఎవరూ తగ్గడం లేదు. తన ఆస్తి తన ఇష్టం అని మోహన్ బాబు అంటున్నారు. తన శ్రమ కూడా ఉందని మనోజ్ అంటున్నారు. ఆస్తుల కోసం కాదని ఆత్మగౌరవం కోసమని ఆయన అంటున్నారు. వీరి మధ్య గొడవలో మోహన్ బాబు ఆవేశం కారణంగా మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదయ్యే వరకూ వెళ్లింది. తాను కూడా వ్యాపార సంస్థల అభివృద్ది కోసం అహర్నిశలు శ్రమించానని ఎవరి సొత్తూ కాదని మనోజ్ చెబుతున్నారు.
జల్ పల్లి నివాసం తనదని.. అక్కడ్నుంచి ఖాళీ చేయించాలని.. మోహన్ బాబు కోరుతున్నారు. అయితే మనోజ్ మాత్రం.. ఆ ఇంట్లో తనకూ హక్కు ఉందని వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. మేజిస్ట్రేట్ ముందు వాదనలు పూర్తి కాకపోవడంతో.. వచ్చేవారం మేజిస్ట్రేట్ ఎదుట మరోసారి హాజరు కానున్నారు. వారి మధ్య సయోధ్య కోసం కుటుంబ సన్నిహితులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెబుతున్నారు.