ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని… మహాత్మాగాంధీని పిలుస్తారు. ఇక నుంచి టాలీవుడ్ మాత్రం `సన్ ఆఫ్ ఇండియా` అంటే.. మోహన్ బాబుని గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ పేరుతో ఇప్పుడు ఆయన ఓ సినిమా చేస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తారు. `బుర్ర కథ`తో దర్శకుడిగా మారారు డైమండ్ రత్నబాబు. ఆ సినిమా సరిగా ఆడలేదు. అయినప్పటికీ… డైమండ్ రత్నబాబుపై మోహన్ బాబు నమ్మకం ఉంచారు. 1992 నేపథ్యంలో సాగే కథ ఇది. దేశభక్తి నేపథ్యంలో నడిచే కథ అని టైటిల్, లోగో డిజైన్ని బట్టే అర్థం అవుతున్నాయి. `పుణ్యభూమి నాదేశం`లో అద్భుతమైన స్పీచ్‌లతో అదరగొట్టాడు మోహన్ బాబు. ఆ సినిమా సరిగా ఆడలేదు గానీ, ఆ డైలాగులు, అందులో నటనా… ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుంటాయి. అంత నిజాయతీ ఈసారి కూడా కనిపిస్తే… సన్ ఆఫ్ ఇండియా కూడా గుర్తుండిపోయే సినిమాలా మిగిలిపోతుంది.