‘మామా ఏక్ పెగ్గులా’ అంటూ ‘పైసా వసూల్’ సినిమాలో పాట పాడి అదరగొట్టేశాడు నందమూరి బాలకృష్ణ. ఈ పాటే ఫ్యాన్స్ పాడుకొంటున్నారు. ఆ హుషారులో ఊగిపోతున్నారు. అయితే.. ఇంత వరకూ ఎవ్వరికీ రాని ఓ డౌట్ మోహన్ బాబుకి వచ్చింది. ‘బాలయ్య మామా ఏక్ పెగ్గులా అంటున్నాడు. బాలయ్య మామ చంద్రబాబు నాయుడుగారికి మందు తాగే అలవాటు లేదు.. మరి పెగ్గు ఎవరు తీసుకురావాలో అర్థం కావడం లేదు’ అంటూ ఓ జోకులాంటిది వేశాడు మోహన్ బాబు. స్టేజీ పై మోహన్‌బాబు వేసిన ఈ జోక్‌కి ఎలా స్పందించాలో అర్థం కాక.. అలవాటు ప్రకారం నవ్వేశాడు బాలయ్య. పైసా వసూల్ ఆడియో విజయోత్సవ సభ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు ముఖ్య అతిధిగా వచ్చాడు. ఈ సందర్భంగా ‘మామా ఏక్ పెగ్గ్లా’ అనే పాట గురించి ఈ టాపిక్ ఎత్తారాయన.
అంతేకాదు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ లా స్టెప్పులు వేశాడు బాలయ్య. ఈ పాట గురించీ మోహన్ బాబు ప్రస్తావించారు. ”అన్నయ్యలా స్టెప్పులు వేయడం ఎవరి వల్లా కాదు. ఈ సినిమాలో బాలయ్య స్టెప్పులు వేశాడట. అది చూస్తా. నాకు నచ్చకపోతే వెంటనే ఫోన్ చేసి చెప్పేస్తా” అంటూ.. నిర్మొహమాటంగా మాట్లాడేశారు మోహన్ బాబు. అంతే కాదు. యాంటీ బాలయ్య ఫ్యాన్స్‌కి చురక వేశాడు మోహన్ బాబు. బాలయ్యకు సంబంధించి రకరకాల ట్వీట్లు చూస్తున్నానని, అవి మంచి పద్ధతి కాదని, బాలయ్య రికార్డులు సృష్టించే సినిమాలు చేశాడని, డబ్బులు ఇచ్చి ఆడించలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాకపోతే డిటైల్స్ లోకి వెళ్లలేదు. లేదంటే… ‘పైసా వసూల్’ ఆడియో వేడుక సంచలనాలకు వేదిక అయ్యేది.