మంచు ఇంట్లో మంటలు రోజు రోజుకీ పెరుగుతూ పోతున్నాయి. ఈరోజైతే మోహన్ బాబు ఇంట్లో హైడ్రామా నడిచింది. ఇప్పటీకీ మోహన్ బాబు ఇంటి పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఉదయమే విదేశాల నుంచి విష్ణు హైదరాబాద్ చేరుకొన్నారు. విష్ణు రాకతో మరింత ఉద్రిక్తత వాతావణం నెలకొంది. మనోజ్ ని ఇంట్లోంచి బలవంతంగా బయటకు గెంటేశారు. ఆయన ఇంటి ముందు మీడియాతో మాట్లాడారు. తన పోరాటం ఆత్మ గౌరవం కోసమే తప్ప, ఆస్తుల కోసం కాదని ఆయన పేర్కొన్నారు. అనంతరం డీజీపీ ని కలిశారు. తిరిగి వచ్చేసరికి.. మనోజ్ ని ఇంట్లోని రానివ్వలేదు. గేటు బయటే ఆపేశారు. `నా కూతురు లోపల ఉంది.. గేటు తీయండి` అని మనోజ్ వేడుకున్నా… ఉపయోగం లేకపోయింది. చివరికి మనోజ్‌తో పాటు అతని బౌన్సర్లు గేటు బద్దలు కొట్టి లోపలకు వెళ్లాల్సివచ్చింది.
లోపల మనోజ్ అడుగు పెట్టగానే, ఆయనతో పాటు కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా వెళ్లిపోయారు. దాంతో మోహన్ బాబుకీ, ఆయన సెక్యురిటీకి కోపం నషాళానికి అంటింది. దొరికిన వాళ్లకు దొరికినట్టు చితకబాదే ప్రయత్నం చేశారు. మోహన్ బాబు అయితే టీవీ 9 ప్రతినిధి మైకు లాక్కుని దౌర్జన్యం చేశారు. మైకుతో కొట్టారు. బూతులు అందుకొన్నారు. దాంతో బౌన్సర్లు మరింత రెచ్చిపోయారు. వాళ్లను గేటు బయట వరకూ వెళ్లగొట్టి, తాళం వేశారు.
మీడియా అంటే గౌరవం అని, తన సినీ ప్రయాణంలో మీడియా పాత్ర కూడా ఎంతో ఉందని పేర్కొనే మోహన్ బాబు ఇప్పుడు మీడియాని ఇంత నీచంగా ట్రీట్ చేయడం ఘోరమైన విషయం. దీన్ని మీడియా వర్గాలు ముక్తకంఠంతో ఖండించాల్సిందే. ఇది కేవలం టీవీ 9 ప్రతినిధిపై చేసిన దాడి కాదు.. మీడియా మొత్తంపై చేసిన దాడి. ఇంట్లో వ్యవహారాలు చక్కబెట్టుకోలేక, రోడ్డెక్కిన మోహన్ బాబు.. ఆ అక్కసుని మీడియాపై తీర్చుకొన్నాడా అనిపిస్తోంది వ్యవహారం చూస్తుంటే. దెబ్బలు తిన్న టీవీ 9 ప్రతినిధి.. గేటు వేస్తుంటే `మోహన్ బాబు రౌడీ `అంటూ నినాదాలు చేశారు. మోహన్ బాబు ప్రవర్తన కూడా అందుకు ఏమాత్రం తీసిపోదు. పెదరాయుడులా ఉండాల్సిన మోహన్ బాబు ఇప్పుడు వీధిరౌడీలా మారాడు. అంతా.. కాల మహిమ.