మంచు మోహన్ బాబు తన ఇద్దరు కుమారులతో కలిసి తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. రోడ్డుపై ధర్నా చేసిన కేసులో ఆయనతో పాటు ఇద్దరు కుమారులపైనా కేసులు నమోదయ్యాయి. ఆ కేసు విచారణ వాయిదాలకు హాజరు కాకపోతూండటంతో వారెంట్ వచ్చే పరిస్థితి ఉండటంతో ఈ సారి ఇద్దరు కుమారులతో కలిసి హాజరయ్యారు. కోర్టుకు హాజరయ్యే విషయంలోనూ మోహన్ బాబు తనదైన నాటకీయత చూపించారు. పాదయాత్రగా కోర్టుకు హాజరయ్యారు.
ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో మోహన్ బాబు తన కాలేజీలకు చంద్రబాబు ప్రభుత్వం పీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వలేదని ఇద్దరు కుమారులతో పాటు స్టూడెంట్స్ను తీసుకుని రోడ్డెక్కారు. రోడ్డు మీద ధర్నా చేశారు. అడ్డంగా పడుకుని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిజానికి మోహన్ బాబు కాలేజీలకు ఇవ్వాల్సిన రీఎంబర్స్ మెంట్ మొత్తం ఇచ్చామని ఆ ఆర్థిక సంవత్సరం ఇంకా పూర్తి కానందున అప్పటిది మాత్రమే బాకీ ఉందని ప్రభుత్వం తెలిపింది. అయినా ఆయన పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత వెళ్లి వైసీపీలో చేరిపోయారు.
అయితే ఆ రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇంత వరకూ రాలేదని తెలుస్తోంది. మోహన్ బాబులాగే విద్యా సంస్థలు నడుపుతున్న అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అప్పటి రీఎంబర్స్మెంట్ ఇప్పటికీ రాలేదన్నారు. మోహన్ బాబు కూడా కొన్ని సందర్భాల్లో ఈ విషయం చెప్పారు కానీ.. ఈ ప్రభుత్వంపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయడం లేదు. అయితే అప్పటి ప్రదర్శన ఇప్పుడు కోర్టుకు లాగింది. మరోసారి సెప్టెంబర్లో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.