మంచు మనోజ్ ను ఉద్దేశించి ఓ ఆడియోను మోహన్ బాబు విడుదల చేశారు. అందులో మనోజ్ పని వాళ్లను కొడుతున్నారని .. పొట్టకూటి కోసం వచ్చిన వాళ్లను కొట్టడం మహా పాపం అని హితవచనాలు పలికారు. మనోజ్ ఎవర్ని కొట్టాడో.. ఎందుకు కొట్టాడో ఆయనకే తెలియాలి. కానీ ఇన్ని మాటలు చెప్పిన మోహన్ బాబు చేసిందేమిటి ?. ఆ టీవీ చానల్ రిపోర్టర్లు కూడా పొట్టకూటి కోసమే తమ ఉద్యోగం చేస్తున్నారు. జీతం కోసమే మోహన్ బాబు ఇంటి ముందు పడిగాపులు పడుతున్నారు.
మీడియా విలువేమిటో మోహన్ బాబుకు బాగా తెలుసు. అందుకే ఆయన మీడియా ప్రతినిధుల్ని బాగా చూసుకుంటారు. తనకు వ్యతిరేకులు అన్నవాళ్లను పట్టించుకోరేమో కానీ.. కాస్త పర్వాలేదు అనుకున్న వారందర్నీ మోహన్ బాబు మంచి వారు అనుకునేలా చూసుకుంటారు. దశాబ్దాలుగా సినీ జర్నలిజంలోఉన్న వారంతా ఎప్పుడో ఒకప్పుడు మోహన్ బాబు మంచి, మర్యాదలకు పొంగిపోకుండా ఉండరు.
అలాంటి ఆయన మీడియాపై దాడి చేయడం అనూహ్యమే కానీ.. తన మర్యాదల్ని పుచ్చుకుని ఇప్పుడు తనపైన.. తన కుటుంబంపై వ్యతిరేక వార్తలు రాస్తున్నారని ఆయనకోపం కావొచ్చు. కానీ నీతులు ఉన్నది చెప్పడానికేనని ఆయన నిరూపించేశారు. మీడియా ప్రతినిధులు కూడా పొట్టకూటి కోసం వచ్చిన వారే. వారిపై ఆయన అలా దాడి చేయడం మాత్రం అనైతికం. చెప్పే మాటలకు.. చేసే చేతలకు పొంతన ఉండదని మరోసారి రుజువైందని జర్నలిజం సమాజం మరోసారి ఎగతాళి చేస్తోంది.