బయోపిక్‌ల కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ఈ జోనర్పై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసుకోవడం వల్ల బయోపిక్స్ లోని మజా తగ్గిపోయింది. ఇప్పటికీ… సరైన పద్ధతిలో ప్రజెంట్ చేయగలిగితే… బయోపిక్‌తో సూపర్ హిట్లు కొట్టొచ్చు. ఇప్పుడు తాజాగా మంచు విష్ణు ఓ కామెంట్ చేశారు. తన తండ్రి మోహన్ బాబు బయోపిక్ చేయాలని ఉందని ప్రకటించారు. అది కూడా తమిళ నటుడు సూర్యతో అయితే బాగుంటుందన్న ఆలోచన వెలిబుచ్చారు.
మోహన్ బాబు బయోపిక్ సూర్యతో చేస్తే కమర్షియల్ గా వర్కవుట్ అవుతుంది. మోహన్ బాబు జీవితంలో చాలా దశలున్నాయి. అంచలంచెలుగా ఎదిగిన నటుడాయన. చిత్రసీమలో అడుగుపెట్టే ముందు రోజుల్లో ఆయన చాలా కష్టాలు అనుభవించారు. అవన్నీ.. గుండెల్ని పిండేసే సన్నివేశాలే. ఆ తరవాత.. దాసరి నారాయణరావు శిష్యరికం, ఒక్కో మెట్టూ ఎదిగిన వైనం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. నిర్మాతగానూ సూపర్ హిట్లు కొట్టారు. పద్మశ్రీ అందుకొన్నారు. రాజకీయాల్లోనూ ప్రవేశం ఉంది. ఈ అన్ని దశల్నీ, అందులోని ఒడిదుడుకుల్ని సరిగ్గా తీయగలిగితే.. బాగానే ఉంటుంది. మోహన్ బాబు అనగానే వివాదాస్పద అంశాలు చాలా ఉన్నాయి. వాటినీ టచ్ చేస్తే… మసాలా యాడ్ అవుతుంది. మరి అలాంటి వాటి జోలికి వెళ్తారా? మోహన్ బాబు అందుకు ఒప్పుకొంటారా? బయోపిక్ అంటే అన్నీ చెప్పాలి కదా. అవన్నీ లేకుండా బయోపిక్ అని పేరు పెడితే… ప్రేక్షకులు అంగీకరించరు.
మోహన్ బాబు జీవిత కథని ఓ జర్నలిస్టు చాలాకాలంగా రాస్తున్నారు. అందులో ఎలాంటి వివాదాస్పద అంశాలూ ఉండకూడదని మోహన్ బాబు స్ట్రిక్ట్ గా చెప్పేశారట. అందుకే ఆ ఆత్మకథ ఆలస్యం అవుతోంది. పుస్తకంలోనే వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనప్పుడు సినిమాగాలో చూపిస్తారా? అనేదే డౌటు.