మోహన్ బాబు సూపర్ హిట్లలో.. ఇళయరాజా పాత్ర కూడా ఉంది. ఓ దశలో.. మోహన్ బాబుతో వరుస సినిమాలకు పని చేశారు ఇళయరాజా. ఇప్పుడు సుదీర్ఘ విరామం తరవాత ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రానికి ఆయన స్వరాలు సమకూరుస్తున్నారు. ఎలాంటి సందర్భానికైనా, ఎలాంటి పదాలకైనా బాణీ కట్టడం ఇళయరాజా ప్రత్యేకత. అలాంటి ఇళయరాజాకే ఓ సవాల్ విసిరారు మోహన్ బాబు.
11వ శతాబ్దానికి చెందిన కవి వేదాంత దేశిక ‘రఘువీర’ అనే గద్యం రచించారు. సంస్కృత సమాసాలతో చాలా క్లిష్టంగా సాగుతుంది. రాముడి గొప్పతనాన్ని కీర్తిస్తూ సాగే గద్యం ఇది. దీన్ని పాట చేయాలంటూ ఇళయరాజా దగ్గరకు వెళ్లారు మోహన్ బాబు. ఆ గద్యం మోహన్ బాబు నోటి నుంచి విన్న ఇళయరాజా.. `ఇది చాలా క్లిష్టంగా ఉంది.. మీరు పాడతారా` అని అడగడం దానికి మోహన్ బాబు `నేను డైలాగులు మాత్రమే చెబుతా.. పాటలు పాడలేను` అని చెప్పడం… ఈ గద్యానికి ట్యూన్ చేయడాన్ని ఇళయరాజా ఓ సవాల్ గా తీసుకోవడం జరిగిపోయాయి. ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తయ్యింది. మరి ఆ పాట ఎలా పాడారో? 11వ శతాబ్దానికి చెందిన గద్యానికీ… ఈ సినిమాకీ సంబంధం ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకుడు. చిత్రీకరణ కూడా పూర్తయింది.