రెబల్ స్టార్ కృష్ణంరాజు కెరీర్లో మర్చిపోలేని సినిమా ‘కన్నప్ప’. తన సొంత బ్యానర్లో బాపు దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం కృష్ణంరాజుకు నటుడిగా, నిర్మాతగా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాని ప్రభాస్‌తో రీమేక్ చేయాలన్నది కృష్ణంరాజు కల, కోరిక. ఆ సినిమాకి తనే దర్శకత్వం వహించాలనుకొన్నారు. స్క్రిప్టు కూడా పూర్తి చేశారు. అయితే ఆ కోరిక తీరకుండానే నిష్క్రమించారు. ఇప్పుడు మంచు విష్ణు ‘కన్నప్ప’గా దర్శనమివ్వనున్నాడు. విష్ణు ‘కన్నప్ప’ తీయాలనుకొన్నప్పుడు కృష్ణంరాజు – మోహన్ బాబు మధ్య వివాదం తలెత్తిందని, ”నేను తీద్దామనుకొన్న కథని నువ్వెలా తీస్తావ్” అని కృష్ణంరాజు మోహన్ బాబుని సంజాయిషీ అడిగినట్టు వార్తలొచ్చాయి. వీటిపై ఈరోజు మోహన్‌బాబు క్లారిటీ ఇచ్చారు.
”కృష్ణంరాజు గొప్ప నటుడు. ఆయన నటించిన ‘కన్నప్ప’ 25 వారాలు ఆడింది. ప్రభాస్‌తో ‘కన్నప్ప’ తీయాలని స్క్రిప్టు కూడా తయారు చేసుకొన్నారు. విష్ణు కన్నప్ప తీయాలనుకొన్నప్పుడు నేను కృష్ణంరాజుకి ఫోన్ చేశాను. నాకో సహాయం కావాలి అని అడిగాను. ‘నీ కోసం ఏమైనా చేస్తా’ అని కృష్ణంరాజు మాట ఇచ్చారు. ‘కన్నప్ప’ గురించి చెప్పినప్పుడు ”నిరభ్యంతరంగా తీస్కో. నా పర్మిషన్ కూడా అవసరం లేదు. కావాలంటే నేను అనుకొన్న సీన్లు కూడా నీకు ఇచ్చేస్తా. విష్ణు కూడా నా బిడ్డలాంటివాడే అని సమాధానం ఇచ్చారు” అంటూ ఆ రోజుల్ని గుర్తు చేసుకొన్నారు మోహన్ బాబు. దాంతో ‘కన్నప్ప’ పూర్తిగా కృష్ఱంరాజు అనుమతితోనే తీశారన్న విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ‘కన్నప్ప’గా ప్రభాస్ కనిపించకపోయినా, ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషించి, ఓరకంగా పెదనాన్న కోరిక పాక్షికంగా సంతృప్తి పర్చగలిగాడు ప్రభాస్.