తిరుపతిలో మోహన్‌బాబుకు చెందిన కాలేజీల విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు. సోషల్ మీడియాలో తమ కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా దెబ్బకు దేశం మొత్తం అతలాకుతలం అవుతున్నా.. క్లాసులు యథావిధిగా నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్గతంగా కాలేజీల్లో ర్యాలీలు నిర్వహించి … సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాము పోస్టులు పెడితే.. తర్వాత కక్ష సాధింపునకు దిగుతారు కాబట్టి.. వాటిని బయట మిత్రులకు పంపి.. వారి ద్వారా విద్యార్థులు సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. మోహన్ బాబు విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కారణంగా కాలేజీలు చాలా వరకూ క్లాసులు నిర్వహించడం లేదు. ఆన్ లైన్ క్లాసులు పెడుతున్నకాలేజీలకు ఫీజులు సరిగ్గా వసూలు కావడం లేదు. అందుకే.. మోహన్ బాబు కాలేజీ… క్లాసులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల.. మొదటి విడత ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో వేసింది. వాటిని అందరూ తీసుకు వచ్చి కాలేజీల్లో కట్టాలంటే ఎట్టి పరిస్థితుల్లో కొన్నాళ్లు అయినా క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం… గతంలో కాలేజీలకే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేది. ఈ సారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసి కాలేజీలకు కట్టమని ఆదేశించింది.
గతంలో మోహన్ బాబు.. ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదని.. ఎన్నికలకు ముందు విద్యార్థుల్ని తీసుకుని రోడ్డెక్కారు. రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. అప్పుడు మోహన్ బాబు వెంట ఆయన కుమారులు… విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు విద్యార్థులు మాత్రమే రోడ్డెక్కే పరిస్థితిలో ఉన్నారు. కరోనా కారణంగా కాలేజీలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల టీచర్లు, విద్యార్థులు పెద్ద ఎత్తున కోవిడ్ బారిన పడ్డారని చెబుతున్నారు. ఓ టీచర్ కూడా మరణించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమయలో క్లాసులు నిర్వహించడంపై సొంత విద్యార్థులే మోహన్ బాబు తీరును విమర్శిస్తున్నారు.
మామూలుగా అయితే క్లాసులు నిర్వహిస్తున్న ప్రతీ కాలేజీలోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మోహన్ బాబు కాలేజీ మాత్రమే.. వివాదాస్పదం అవుతుంది. ఆయన కాలేజీని వాడుకుని రాజకీయం చేయడం దీనికి కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.