ఈనెల 9న మూడు సినిమాలొస్తున్నాయి. ఇంటిలిజెంట్, తొలిప్రేమతో పాటు గాయత్రి కూడా అదే రోజున వస్తోంది. ఒక విధంగా బాక్సాఫీసు దగ్గర ముక్కోణపు పోటీ చూడబోతున్నాం. వినాయక్ సినిమా కాబట్టి.. తొలి ఓటు ఇంటిలిజెంట్కి పడొచ్చు. ఆ తరవాత తొలి ప్రేమ చూస్తారు. గాయత్రిది థర్డ్ ఆప్షనే. కాకపోతే మోహన్ బాబు మాత్రం ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నారు. తండ్రీ కూతర్ల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. రీమేక్ కథ కాబట్టి… కథ పరంగా తప్పు జరగకపోవొచ్చు. ట్రైలర్లో మోహన్ బాబు పలికిన డైలాగులు బాగా పేలాయి. విష్ణు, శ్రియలతో కూడిన బ్యాకప్ బాగానే సెట్టయినట్టు అనిపిస్తుంది. ఎం.ధర్మరాజు ఎం.ఏ తరవాత మోహన్ బాబుని అంత పవర్ఫుల్రోల్ లో చూడడం ఇదే అని గట్టి నమ్మకం. తన పాత్ర, దాని చుట్టూ పలికిన భావోద్వేగాలు బాగా పండాయని మోహన్ బాబు నమ్ముతున్నారు. అందుకే.. చాలా కాలం తరవాత ప్రమోషన్లపై గట్టిగా దృష్టి పెట్టారు. టీవీ ఛానళ్లు, దిన పత్రికలు, ఎఫ్ ఎమ్లు.. ఇలా దేన్నీ వదలకుండా ప్రమోషన్లు గట్టిగా చేయాలని డిసైడ్ అయ్యారు. ఈరోజే సెన్సార్ కూడా పూర్తయ్యింది. యూ బై ఏ సర్టిఫికెట్తో ఈ సినిమా విడుదల అవుతోంది. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటీవ్ గా ఉండడంతో మోహన్ బాబు మరింత ఉత్సాహంగా బరిలోకి దిగుతున్నారు.