రిపబ్లిక్ సినిమా ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ ను జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న తీరుపై చేసిన ఘాటు విమర్శలు సంచలనం సృష్టించాయి. తన ఉపన్యాసం లో భాగంగా పవన్ కళ్యాణ్ మోహన్ బాబు పేరు ను ప్రస్తావించడం తో మోహన్ బాబు ప్రతిస్పందించారు. అయితే చిత్ర పరిశ్రమ సమస్యల కంటే కొడుకు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికే తనకు ముఖ్యం అన్నట్లుగా మోహన్ బాబు మాట్లాడడం ఆయన ప్రతిస్పందన చూసి వారిని నివ్వెరపరుస్తోంది. వివరాల్లోకి వెళితే …
నిన్న రిపబ్లిక్ సినిమా ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, జగన్ మరియు వైయస్ కుటుంబం తమకు బంధువులు అని చెప్పుకునే మోహన్ బాబు చిత్ర పరిశ్రమ సమస్యల పై జగన్ తో మాట్లాడాల్సిందిగా కోరారు. గతంలో రాజ్య సభ ఎంపి గా కూడా మోహన్ బాబు పని చేసినందున దీనిని ఒక బాధ్యతగా తీసుకొని చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఇప్పట్లో విడుదల కావాల్సినవి తమ సినిమాలు ఏమీ లేవు కాబట్టి స్పందించవలసిన అవసరం లేదు అని అనుకుంటే రేపు పొద్దున జగన్ ప్రభుత్వం విద్యా నికేతన్ సంస్థల పై కూడా ఇలాగే జీవో లు తీసుకు వచ్చినప్పుడు మిగతా వారు కూడా మాట్లాడకుండా ఉండిపోయే అవకాశం ఉందంటూ పవన్ కళ్యాణ్ మోహన్ బాబు ని హెచ్చరించారు. అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధ సమయం లో హిట్లర్ మిగతా వారిని ఊచకోత చేస్తున్నప్పుడు తన దాకా రాలేదు కదా అని మిన్నకుండి పోయి, చివరకు తనదాకా హిట్లర్ సైన్యం వచ్చేసరికి తన కోసం మాట్లాడడానికి ఎవరు లేరు అంటూ బాధ పడ్డ ఒక ప్రొటెస్టెంట్ ఉదంతాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఉటంకిస్తూ ఆ విధం గా ఉండవద్దని మోహన్ బాబు కు సూచన చేశారు.
అయితే దీని పై మోహన్ బాబు స్పందించారు. సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ, ” నా చిర కాల మిత్రుని కి సోదరుడైన పవన్ కళ్యాణ్, నువ్వు నాకంటే చిన్న వాడివి అందుకని ఏక వచనంలో సంబోధిస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదు . చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావు, సంతోషమే. ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు అన్న సంగతి మీకు తెలిసిందే . అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి . ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాట కి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నీవు చేయవలసిన ముఖ్యమైన పని, నీ అమూల్యమైన ఓటు ని నీ సోదర సమానుడైన విష్ణు బాబు కు , అతని ప్యానల్ కి వేసి , వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను, థాంక్యూ వెరీ మచ్” అని పోస్ట్ చేశారు మోహన్ బాబు.
నిజంగానే మోహన్ బాబు వైఖరి పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో ప్రస్తావించిన- రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇప్పుడు నాకు ఏమీ సమస్య లేదు కదా, నా దాక వచ్చినప్పుడు చూసుకుందాం అన్నట్టు ప్రవర్తించిన ప్రొటెస్టెంట్ లాగా నే ఉంది. చిత్ర పరిశ్రమ కుదేలు అయిపోతుందని సినిమాలు తీసిన నిర్మాతలు బాధపడుతూ ఉంటే, మోహన్ బాబు మాత్రం నింపాదిగా విష్ణు బాబు పోటీ చేస్తున్న మా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, తనకు తీరిక కుదిరినప్పుడు, తనకు నొప్పి తెలిసినప్పుడు మాత్రమే స్పందిస్తా అన్నట్లుగా మాట్లాడడం పరిశ్రమ లోనే తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది .
మరి కనీసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా మోహన్ బాబు స్పందిస్తాడా లేక తన సినిమాలో, తన కొడుకు సినిమాలో విడుదలకు సిద్ధమైన సమయం లో స్పందించి అప్పుడు తనకు మద్దతుగా పరిశ్రమ మొత్తం తరలి రావాలని పిలుపునిస్తాడా అన్నది వేచి చూడాలి.