పుట్టిన రోజు వేడుకల్లో మోహన్ బాబు స్పీచ్‌లో తన జీవితంలో ఎంతో సంతోషించానన్న ఆనందమే పెద్దగా కనిపించలేదు. అందరూ తనను వాడుకున్నారని.. తనకు మాత్రం ఉపయోగపడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కూడా తనతో ఎంతో మంది ఎన్నో రకాలుగా వాడుకున్నారన్నారు. ప్రచారం చేయించుకున్నారు.. కానీ వారెవరూ తనకు సహాయం చేయలేదన్నారు. గతంలో టీడీపీకి ప్రచారం చేశారు.. దానికి తగ్గట్లుగా చంద్రబాబు సిఫార్సుతోనే తనకు రాజ్యసభ సీటు వచ్చిందని మోహన్‌బాబే ఇంటర్యూల్లో చెప్పారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి దూరయ్యారు.
గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ కోసం ప్రచారం చేశారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వం తప్పుడు ప్రచారంతో రోడ్డెక్కారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత నేరుగా వైసీపీలో చేరారు. ఆ పార్టీకి ప్రచారం చేశారు. అయితే.. ఆయనకు గత మూడేళ్లుగా ఎలాంటి పదవి ఇవ్వలేదు. టీటీడీ చైర్మన్ లాంటి పదవులపై ఆయన ఆశలు పెట్టుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆయనకు మోహన్ బాబు యూనివర్శిటీకి పర్మిషన్ మాత్రం లభించింది. అన్ని అర్హతలు ఉంటే ఆటోమేటిక్‌గా ఆయనకు పర్మిషన్ వచ్చేది దీనికి ప్రభుత్వ సహకారం అవసరం లేదు.
పుట్టిన రోజు వేడుకల్లో మోహన్ బాబు వ్యక్తం చేసిన అసంతృప్తి ప్రకారం జగన్ నుంచి ఇంకా ఏదో కోరుకుంటున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. అదే ఏమిటన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు . సినీ పరిశ్రమ నుంచి రాజ్యసభకు అలీని పంపిస్తారన్న ప్రచారం కారణంగా.,. లెజెండ్ లాంటి తాను ముందే పార్టీలో చేరి… ప్రచారం చేస్తే ఎందుకు గుర్తించడం లేదన్న ఆవేదన కావొచ్చని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు. మోహన్ బాబు ఆవేదనను జగన్ గుర్తిస్తారో లేదో మరి !