ఇటీవల కిష్కింధకాండ అనే మలయాళ సినిమా ఓటీటీల్లోకి వచ్చింది. ఈ సినిమా టైటిల్ ఎలా ఉన్నా కథ మాత్రం.. ఓ సీనియర్ సిటీజన్ తన లైసెన్స్డ్ రివాల్వర్ పోగొట్టుకుంటారు. అది తెచ్చివ్వమంటే రేపుమాపు అని తప్పించుకు తిరుగుతారు. ఆ తుపాకీ ఏమయింది.. ఏం జరిగింది అన్నది తర్వాత.. కానీ ఇప్పుడు మోహన్ బాబు తుపాకీని డిపాజిట్ చేయమని పోలీసులు ఒత్తిడి చేస్తున్నా ఆయన ఆ పని మాత్రం చేయడం లేదు. రేపు మాపు అని తిప్పుకుంటున్నారు.
పోలీసులు మూడు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా వారికి అందుబాటులోకి రాలేదు. స్టేట్ మెంట్ తీసుకుంటామని అంటే.. రావాలని పిలిచి .. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసేసరికి కనిపించకుండాపోయారు. హఠాత్తుగా ఆయన ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న టీవీ9 రిపోర్టర్ ను పరామర్శించారు. విష్ణుతో వెళ్లి కుటుంబసభ్యులతో చర్చించారు. కేసును విత్ డ్రా చేసుకునేలా ఆయన మాట్లాడుకున్నట్లుగా చెబుతున్నారు.
ఇది హత్యాయత్నం కేసు కావడంతో కొన్ని రోజులు అయినా జైలుకెళ్లే పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. అరెస్టు గురించి కాదని.. ముందుగా ఆయుధం డిపాజిట్ చేయాలని పోలీసులు పదే పదే కోరుతున్నారు. కానీ తానే రెండు, మూడు రోజుల్లో విచారణకు వస్తానని అపుడే డిపాజిట్ చేస్తానని అంటున్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా ఆయుధం డిపాజిట్ చేయకపోవడం ఖచ్చితంగా పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంటుంది. ఆ సంగతి ఆయనకు తెలియనిదికాదు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?.