తాను బీజేపీ మనిషినని మోహన్ బాబు తిరుపతి కోర్టు ఎదుట బహిరంగంగా చెప్పుకున్నారు. ఆయన ఏ పార్టీ మనిషని ఏ మీడియా ప్రతినిధి అడగలేదు. కానీ ఆయనంతటకు ఆయనే చెప్పుకున్నారు. తాను బీజేపీ మనిషినని.. బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తినని చెప్పుకొచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు ఆయనపై నమోదు కావడంతో కోర్టు వాయిదాకు హాజరయ్యారు. ఇంత కాలం హాజరు కాలేదు. దీంతో తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున బలప్రదర్శన ద్వారా… విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి పాదయాత్ర చేయడమే కాకుండా తాను బీజేపీ మనిషిని చెప్పుకోవడం అందర్నీ విస్మయపరుస్తోంది.
2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేదని ఇద్దరు కుమారులతో పాటు విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి ఆయన రోడ్డుపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. తర్వాతి రోజు హైదరాబాద్లో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు మోహన్ బాబు. ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ప్రచారం చేశారు. అయితే ఆ తర్వాత ఆయనకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. ఎలాంటి పదవి కూడా ఇవ్వలేదు. కానీ ఎప్పుడూ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించలేదు.
కానీ మధ్యలో ఓ సారి కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిశారు. అప్పట్లో బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది కానీ ఆయన చేరలేదు. ఇటీవల ప్రత్యక్ష రాజకీయాలకు దూరమని కొన్ని ఇంటర్యూల్లో చెప్పారు. ఇప్పుడు కోర్టు ఎదుట నేరుగా తాను బీజేపీ మనిషినని చెప్పుకోవడంతో రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంతగా బీజేపీ మనిషి అయితే ఏపీలో జరిగిన మూాడు ఉపఎన్నికల్లో ఒక్క సారి కూడా బీజేపీకి ఎందుకు మద్దతు ప్రకటించలేదని.. ఒక్క సారి కూడా ఎందుకు ప్రచారం చేయలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. బీజేపీ మనిషి అయితే కొన్ని వ్యవస్థలు మత జోలికి రావాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.