2019 ఎన్నికలకు ముందు మోహన్ బాబు ఓ సంచలనం. ఆయన తన ఇద్దరు కొడుకులతో విద్యార్థుల్ని తీసుకుని రోడ్డెక్కిచేసిన ఆందోళన సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆయన నేరుగా లోటస్ పాండ్ వెళ్లి సీఎం జగన్ సమక్షంలో కండువా కప్పించుకుని చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. అయితే ఇప్పుడు మాత్రం మోహన్ బాబు అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. తాను రాజకీయాలకు 99 శాతం దూరం అని చెబుతున్నారు. ఆ ఒక్క శాతం ఆప్షన్ పెట్టుకున్నారట.. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ఇంటికి ఎప్పుడైనా రావొచ్చనిఆఫర్ ఇచ్చారు. తన ఇంటికి అంటే ఇక్కడ బీజేపీకి అని అనుకోవాలి. అంటే ఇప్పుడు ఆయన వైసీపీలో లేరు కానీ రాజకీయం చేయదల్చుకుంటే మాత్రం బీజేపీలో చేరుతారట. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్తగా ప్రారంభించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో స్పష్టం చేశారు.
జగన్ ప్రభుత్వం గొప్పగా పన చేస్తుందని ఆయన చెప్పలేదు. కానీ పాలన చెడ్డగా ఉందని మాత్రం పరోక్షంగా అంగీకరించారు. ఇతర విషయాల సంగతేమో కానీ తాను రోడ్డెక్కి ఆందోళన చేసిన విషయంలోనూ ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అయితే గతంలో చంద్రబాబును నిందించినట్లుగా ఇప్పుడు నేరుగా జగన్ ను నిందించడానికి ఆయనకు ధైర్యం సరిపోలేదు. అందుకే కొంత మంది ఐఏఎస్ ఆఫీసర్లను నిందించారు. తన విద్యా సంస్థలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోని అంశాలకు కూడా ఆర్కే చాలా సమాధానాలిచ్చారు. చిరంజీవితో మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయనని కూడా పరోక్షంగా స్పష్టం చేశారు. అది కూడా మా ఎన్నికల విషయంలోనే అని నేరుగా చెప్పారు.
ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కానే కాదని కుండబద్దలు కొట్టారు. ఇండస్ట్రీ విషయంలో మోహన్ బాబు వ్యవహారశైలికి ఎంత మద్దతు ఉందో ఆయన కుమారుడు విష్ణుకు పడబోయే ఓట్లతోనే తేలిపోతుంది. అయితే రాజకీయంగా మోహన్ బాబు మాత్రం తన ముక్కుసూటి తనాన్ని బయట పెట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు మాట్లాడితే తాను గతంలో తప్పు చేసినట్లుగా అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుందనో.. లేకపోతే ఆర్థిక మూలాలు దెబ్బతీస్తారన్న భయమో కానీ.. మునుపటి మోహన్ బాబు మాత్రం తాజా ఇంటర్యూో మిస్సయ్యారు.