ఆయన అంత హడావుడి చేసిందీ దీని కోసమేనా అన్నట్టుగా ఉంది ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు తీరు. ఫీజు రీఎంబర్స్ మెంట్ అంశాన్ని తీసుకుని, ఏదో పోరాటం చేసేసిన బిల్డప్ ఇచ్చి, చివరికి వైకాపాలో చేరిపోయారు. మామూలుగా చేరినా కొంత బాగుండేదేమో. ఇంతకీ, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, ప్రచారానికి కొద్దిరోజులు మాత్రమే గడువు ఉన్న ఇలాంటి తరుణంలో మోహన్ బాబును ఎందుకు పార్టీలోకి తీసుకున్నట్టు..? పార్టీపరంగా ఆయన చేరిక ఏ విధమైన లాభాన్ని తెస్తుంది..? సామాజిక వర్గం పరంగానైనా ఆయన చేరిక అనూహ్యమైన ప్రభావం చూపుతుందా..? ఆయన కుటుంబ, సినీ గ్లామర్ వైకాపా ప్రచారానికి కొత్త ఊపు తెస్తుందా..? డైలాగ్ కింగ్ కాబట్టి, ఆయన మైక్ పట్టుకుంటే జనాలు మైకంలో మునిగేట్టు చేస్తారానా..? ఇంతకీ, వైకాపాలో మోహన్ బాబు చేరడం వల్ల వైకాపాకి వీసమెత్తైనా లాభముందా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
నిష్కర్షగా మాట్లాడుకుంటే… మోహన్ బాబును చేర్చుకోవడం వల్ల వైకాపాకి జరిగే మేలు సున్నా. అంశాలవారీగా చూసుకుంటే… నటుడిగా మోహన్ బాబు ఇప్పుడు ఫామ్ లో లేరు. గత చిత్రాలేవీ తెలుగు ప్రేక్షకులను గొప్పగా ఆకట్టుకున్న దాఖలాలు లేవు. ఒకప్పటి ఆయన ప్రభ.. ఇప్పుడు లేదన్నది వాస్తవం. ఇక, కుటుంబంలో మంచు విష్ణు, మంచు మనోజ్… యువ తారలు. పోనీ, వారైనా మాంచి ఊపులో ఉన్నారా, యువతను ఉర్రూతలూగిస్తున్నారా… అదీ లేదు. అడపాదడపా విష్ణు సినిమాలైనా వస్తున్నాయి. మనోజ్ అయితే సినిమాలకు దాదాపుగా దూరంగా ఉంటున్న పరిస్థితి. ఆ కుటుంబం నుంచి మంచు లక్ష్మీ ఉన్నారు. ఆమె కూడా నటిగా ఏమంత ప్రభావంతమైన స్థానంలో లేరు. అంటే, సినీ గ్లామర్ పరంగా చూసుకుంటే… వీరంతా వైకాపా తరఫున ప్రచారానికి వచ్చినా ప్రభావం ఉండదు.
రాజకీయంగా చూసుకున్నా… మోహన్ బాబు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పోనీ, ఇతర సేవా కార్యక్రమాల ద్వారా అయినా ప్రజల గుడ్ లుక్స్ లో ఉన్నారా అంటే అదీ లేదు. చివరికి.. వైకాపాలో చేరే ముందు విద్యార్థులను రోడ్డు మీదికి తీసుకొచ్చి, యువతరం కోసం పోరాటం అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి… జగన్ దగ్గర పార్టీలో చేరిపోయిన క్రమం మైనస్ అయింది. వైకాపాలో చేరడం కోసం.. విద్యార్థులను వాడుకున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన్ని పార్టీలోకి తీసుకొస్తే… ఎలా ప్లస్ అవుతుంది? వాస్తవానికి మోహన్ బాబు తననితాను వైకాపాకి చెందిన వ్యక్తిగా స్వయంగా ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. సరే, ప్రచారం మాంచి ఊపు మీదున్న తరుణంలో ఆయన్ని చేర్చుకుని… వైకాపా సభలకు జగన్ పంపగలరా? చంద్రబాబుపై ఆయనతో విమర్శలు చేయించడం ద్వారా కొత్తగా ఏదైనా మారుతుందా? వైకాపా నవరత్నాలు, జగన్ హామీలకు ఆయన నయా బ్రాండ్ అంబాసిడర్ కాగలరా? ఇంతకీ… ఆయన్ని ఏ ఉద్దేశంతో ఇప్పుడు పార్టీలో చేర్చుకున్నట్టు? కనీసం ఈ ప్రశ్నకు అయినా వైకాపా దగ్గర క్లారిటీ ఉందా?