మోహన్ బాబు శంషాబాద్ సమీపంలో ఓ ఇల్లు కట్టుకుని జూబ్లిహిల్స్ ఇంటిని మంచు లక్ష్మికి ఇచ్చేసి వెళ్లిపోయారు. మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో పాటే ఉంటున్నారు. మంచు మనోజ్ మాత్రం వేరేగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో వారి మధ్య సంబంధాలు సరిగ్గా లేవని అందరికీ తెలుసు. మోహన్ బాబు యూనివర్శిటీలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చినప్పుడు మనోజ్ భిన్నంగా స్పందించారు. తనకూ బాధ్యత ఉందన్నట్లుగా చెప్పారు. అంటే యూనివర్శిటీలో తనకూ భాగం ఉందని ఆయన భావిస్తూ ఉండవచ్చు. అలాంటిదేమీ లేదని మంచు విష్ణు, మోహన్ బాబు వాదిస్తూ ఉండటం వల్ల అసలు సమస్య ప్రారంభమయిందని అంటున్నారు.
మోహన్ బాబు ఇప్పటికే ఆస్తులు పంచేశారు. ఆయన గతంలో హైదరాబాద్ శివారులోని ఓ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వారి వారిభాగాలకు వచ్చి నఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించేశారు. అయితే మోహన్ బాబు కుటుంబానికి ఎక్కువగా ఆదాయం తెచ్చి పెట్టేది విద్యా సంస్థలు. మిగతావన్నీ ఖర్చులే తప్ప ఆదాయాలు ఉండవు. ఆ యూనివర్శిటీ, విద్యా సంస్థలను మనోజ్ కు కాకుండా చేశారని అంటున్నారు. ఈ క్రమంలో దానిలో హక్కు కోసం మనోజ్ పోరాడుతున్నారని చెబుతున్నారు. ఈ అంశంపై మోహన్ బాబు నివాసంలో శనివారం రాత్రి సమావేశమయ్యారు. మాట మాట పెరగడంతో మోహన్ బాబు తన అనుచరులు ఉన్న వినయ్ అనే వ్యక్తిని ప్రేరేపించి కుమారుడని కొట్టించారని అంటున్నారు. దీంతో మనోజ్ పోలీసులకు ఫోన్ చేశారు.
పోలీసులు రావడంతో తమపైనా మనోజ్ దాడి చేశారని చెప్పారు. అయితే విషయం పోలీసుల వరకూ వెళ్తే.. కేసుల వరకూ వెళ్తే అందరికీ ఇబ్బందేనని.. మాట్లాడుకుందామని చెప్పి మనోజ్ ను కన్విన్స్ చేసి.. అంతా హ్యాపీసేనని పోలీసులకు చెప్పి పంపేశారు. కుటుంబ వివాదం కావడంతో పోలీసులు అంతకు మించి జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. అయితే ఈ వివాదం ఇంతటితో ఆగే అవకాశం లేదు. మంచు మనోజ్ ఆస్పత్రిలో చేరడంతో… తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసుకుంటారని అంటున్నారు.