ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నందులు తెలుగు చలన చిత్రపరిశ్రమలో చిచ్చు రేపింది. తెలుగుదేశం ప్రభుత్వానికి, బాలకృష్ణకు ఇష్టమైన వ్యక్తులకు అవార్డులు ఇచ్చుకున్నారని, తమకు అన్యాయం జరిగిందని కొందరు బాహాటంగా అసంతృప్తిని వెళ్ళగగ్గారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు “కలలోనూ (నంది) అవార్డుల గురించి ఆలోచించను” అంటూ అవార్డుల కమిటీపై విమర్శలు చేశారు. మొన్నటి నందుల్లో మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీకి ‘చందమామ కథలు’ చిత్రంలో పాత్రకు ఉత్తమ సహాయ నటి అవార్డు వచ్చింది. అది తప్పితే మంచు ఫ్యామిలీకి పెద్దగా అవార్డులు రాలేదు.
ఈ అంశం గురించి ‘నంది అవార్డుల్లో మీకు అన్యాయం జరుగుతోందనే అసంతృప్తి ఉందా?’ అని ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించగా “కలలో కూడా అవార్డుల గురించి ఆలోచించాను. నా సమయం వృధా అనుకొంటా. ప్రతిభ కలిగిన వారిలో ఎంత మందికి నందులు ఇచ్చారో? అవార్డుల కమిటీని ప్రశ్నించండి! ఎవరు రికమండ్ చేస్తే అవార్డులు ఇచ్చారో నిలదీయండి! కాణిపాకంలో వినాయకడి ముందు అసత్యాలు చెప్తే తలకాయలు పగులుతాయట. నిక్కచ్చిగా, నిజాయితీగా ఎంతమందికి అవార్డులు ఇచ్చారో? అక్కడికి వెళ్లి ప్రమాణం చేసి చెప్పమనండి” అని మోహన్‌బాబు వ్యాఖ్యానించారు.