విలక్షణ నటుడు మోహన్ బాబు ఆశల మీద ముఖ్యమంత్రి జగన్ నీళ్లు చల్లినట్లు గాను, దీంతో మోహన్ బాబు వైఎస్ఆర్సిపి మీద, జగన్ మీద అలకబూనినట్లు కొన్ని వర్గాల నుండి సమాచారం అందుతోంది. దీంతోపాటు రాజకీయ భవిష్యత్తుపై ఆయన పెట్టుకున్న ఆశలు మీద అన్ని వైపుల నుండి ప్రతికూల పరిస్థితి ఎదురుకావడంతో, రాజకీయాల విషయంలో మోహన్ బాబు లో నిర్వేదం ఏర్పడ్డట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
టిడిపి హయాంలో మోహన్ బాబుకి రాజ్యసభ:
మోహన్ బాబు మొదట తెలుగు దేశం పార్టీ లో ఉండేవారు. ఎన్టీఆర్ మీద ఎంతో అభిమానం చూపేవారు. అయితే చంద్రబాబు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన ప్పుడు, చంద్రబాబు వెంట నడిచారు. చంద్రబాబు మోహన్ బాబు ని రాజ్యసభకు కూడా పంపారు. అయితే రెండవ సారి మోహన్ బాబు ని రాజ్యసభకు పంపక పోవడంతో ఆయన చంద్రబాబు కి ఎదురు తిరిగి పార్టీని వీడారు. అడపాదడపా తన సినిమాల్లో చంద్రబాబు మీద సెటైర్లు వేశారు. తర్వాతి కాలంలో వైయస్సార్ కి దగ్గరయ్యారు. 2019 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు ముందు బాహాటంగా వైఎస్ జగన్ ని సమర్థించారు. తన కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేయలేదని ధర్నా కూడా చేశారు.
రాజ్యసభ సీటుపై ఆశపడ్డ మోహన్ బాబు, హ్యాండ్ ఇచ్చిన జగన్ :
అయితే వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రభుత్వం నుండి మోహన్ బాబు కి ఎటువంటి నామినేటెడ్ పదవి కానీ , ఎటువంటి ఇతర పదవీ కానీ దక్కక పోవడంతో ఆయన కాస్త అలిగినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రానున్న రాజ్యసభ లో దాదాపు నాలుగు ఎంపీ స్థానాలు వైఎస్ఆర్సీపీ కి దక్కనుండడంతో వాటిలో ఒక ఎంపీ స్థానం కోసం ఆయన గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ , మోహన్ బాబు ఆశల మీద నీళ్లు చల్లి నట్లు గా తెలుస్తుంది. నాలుగు రాజ్యసభ పదవులకు పార్టీ నుండి విపరీతమైన పోటీ ఉండడం, పైగా అంబానీ సన్నిహితులు వీటిలో ఒక సీటుని కోరడం వంటి కారణాల రీత్యా జగన్ మోహన్ బాబు ని రాజ్యసభకు పంపే అంశాన్ని కనీసం పరిశీలించిను కూడా లేదని తెలుస్తోంది.
ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బాబు హయాంలో ధర్నా, ఇప్పటికీ అదే పరిస్థితి:
అంతేకాకుండా గత ప్రభుత్వం హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ప్రభుత్వం విడుదల చేయడం లేదని మోహన్‌బాబు ధర్నా చేశారు. చంద్రబాబు పై రాజకీయ విమర్శలు కూడా చేశారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు అయినప్పటికీ , ఇప్పటికి కూడా తనకు రావాల్సిన డబ్బులు పూర్తిగా రాలేదని తెలుస్తోంది. అయితే ఎన్నికలకు ముందు జగన్ కు మద్దతు ఇచ్చిన కారణంగా, అప్పుడు చంద్రబాబుని నిలదీసి నట్లుగా, ఇప్పుడు జగన్ ని బహిరంగంగా నిలదీయలేని పరిస్థితి లో మోహన్ బాబు ఉన్నారు.
బిజెపి నుండి లభించని సానుకూల స్పందన:
అయితే గత కొద్దేళ్లుగా తాను నమ్ముకున్న వైఎస్ఆర్సిపి నుండి ఎటువంటి ప్రయోజనము కలగక పోవడంతో ఆ మధ్య మోహన్ బాబు ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలను కలిసారు. అయితే బిజెపి నుండి కూడా మోహన్ బాబు కి రాజకీయ భవిష్యత్తు విషయంలో ఎటువంటి భరోసా లభించలేదని, సానుకూల స్పందన రాలేదని సమాచారం.
మొత్తానికి అటు రాజ్యసభ ఆశల మీద జగన్ నీళ్లు చల్లడం , ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పూర్తిగా రాకపోయినా గతంలోలాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసే పరిస్థితి లేకపోవడం, ఇటు బిజెపి వైపు నుండి కూడా సానుకూల స్పందన రాకపోవడంతో ప్రస్తుతం మోహన్ బాబు రాజకీయ పరంగా ఒక నిర్వేదంలో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అనేది వేచి చూడాలి.