తండ్రికొడుకుల సవాల్ అంతకంతకూ పెద్దది అవుతోంది. తాజాగా మంచు మనోజ్ పై .. మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మోహన్ బాబు వర్శిటీలోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు కుటుంబంలోని వివాదం జల్ పల్లి నివాసం నుంచి ఎంబీ యూనివర్శిటీకి చేరిందని అనుకోవచ్చు.
రంగంపేటలో జల్లికట్టు పోటీలు చూసేందుకు వచ్చిన మనోజ్.. తన తాతయ్య, నానమ్మల సమాధులకు నివాళులు అర్పించేందుకు లోపలికి వెళ్తానని పట్టుబట్టారు. నిజానికి ఆయన వస్తున్నారని రెండు రోజుల ముందే మోహన్ బాబు క్యాంపునకు తెలిసింది. అందుకే అప్రమత్తమయ్యారు. కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. బౌన్సర్లను పెట్టుకున్నారు. మనోజ్ కు రంగంపేటలో కొంత మంది మద్దతు ఉంది. అలాగే యూనివర్శిటీ విద్యార్థుల్లో ఓ వర్గం సపోర్టు కూడా ఉంది. దాంతో మనోజ్ వచ్చి.. వర్శిటీలో అక్రమాలపై ధర్నాలు లాంటి పనులు చేస్తే పరువు పోతుందని.. యూనివర్శిటీ ఇమేజ్ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆయనను లోపలకి రాకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు.
అయితే మనోజ్ మాత్రం తాను చేయాలనుకున్నది.. చెప్పాలనుకున్నది చెప్పారు. యూనివర్సిటీ అభివృద్ధిలో తన పాత్ర కూడా ఉందని ఆయన చెబుతున్నారు. ఇది ఏ ఒక్కరిదీ కాదన్నారు. కారణం ఏదైనా మనోజ్..తండ్రితో తాడేపేడో తేల్చుకోవాలని డిసైడయ్యారు. ఈ వివాదాన్ని ఎందుకు మోహన్ బాబు పెంచుకుంటున్నారో కానీ.. ఆస్తులు సమానంగా రాసి ఇచ్చిఅయినా కుటుంబ పరువును కాపాడుకోవాలి కానీ ఇలా ఎందుకు రచ్చ చేసుకుంటున్నారోనని సామాన్య జనం కూడా చర్చించుకుంటున్నారు.