హీరో మోహన్ బాబును ప్రధాని మోదీ స్వయంగా ‘బీజేపీలో చేరండి’ అని ఆహ్వానించారు. కాని మోహన్‌బాబు ‘వైఎస్ జగన్ చక్కగా పరిపాలిస్తున్నాడు. కాబట్టి నేను వైకాపాలోనే ఉంటా’ అన్నారు. మోహన్‌బాబు ఈ విషయం సీరియస్‌గా అన్నారో, జోక్‌గా అన్నారో తెలియదు. ఈరోజు ఆయన కొడుకు, కోడలు, కూతురుతో కలిసి పనిగట్టుకొని ఢిల్లీ వెళ్లి ఉదయం ప్రధాని మోదీని, సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకున్నారు. ఆ తరువాత మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులు బీజేపీలో చేరుతున్నారని మీడియాలో ప్రచారం జరిగింది. మోహన్‌బాబు సినిమా నటుడు, విద్యా సంస్థల అధిపతి. ఇవి ఆయన మెయిన్ క్వాలిఫికేషన్స్. వైకాపా నాయకుడు అనేది ప్రధానార్హత కాదు.
ఇలాంటి వ్యక్తితో, ఆయన కుటుంబ సభ్యులతో మోదీ అరగంటకు పైగా గడిపారు. అంత సమయం కేటాయించాల్సిన అవసరమేముంది? ముఖ్యమంత్రులకే అపాయింట్మెంట్ ఇచ్చి రద్దు చేసిన సందర్భాలున్నాయి. సరే…ప్రధాని అంతటి వ్యక్తి అపాయింట్మెంట్ ఇవ్వడం, అంత సమయం కేటాయించడం, ఆప్యాయంగా కౌగిలించుకోవడం…ఇదంతా మోహన్‌బాబు అదృష్టం. పెద్ద పెద్ద నాయకులే బీజేపీలో చేరాలనుకుంటే కేంద్రంలో పలుకుబడి ఉన్న లేదా మోదీకి, అమిత్‌షాకు సన్నిహితులైన నేతల ద్వారా వెళ్లి పార్టీలో చేరుతారు. అలా చేరిన వారితో ప్రధాని ఐదు నిమిషాలు కూడా మాట్లాడతారో లేదో చెప్పలేం. అలాంటది ప్రధాని మోహన్‌బాబును ‘బీజేపీలో చేరండి’ అని ఆహ్వానం పలికారు. మరి ఈ మాజీ కలెక్షన్ కింగ్ ప్రధానికి ఏం చెప్పారో తెలియదు.
కాని బయట మాత్రం ‘నాకు పార్టీ మారే ఆలోచన లేదు’ అన్నారు. మరి ఈయన పనిగట్టుకొని ఢిల్లీ వెళ్లి ప్రధానిని, అమిత్ షాను ఎందుకు కలిశారు? దీనికి మోహన్‌బాబు ఏం చెప్పాడంటే…దేశాన్ని మోదీ సమర్థంగా ముందుకు నడిపిస్తున్నారు. ఆయన నాయకత్వం నాకు చాలా ఇష్టం. ఆయన చేస్తున్న పనిని సమర్థించడానికే వచ్చాను తప్పితే పార్టీ మారే ఆలోచన లేదు’ అని చెప్పారు. ఇంతటితో ఆగకుండా ‘నేను రాజకీయంగా జగన్‌కు సపోర్ట్ ఇచ్చాను. ఆయన మంచి పాలన అందిస్తున్నాడు’ అని కితాబిచ్చారు. ప్రధాని మోదీ అంటే మోహన్‌బాబుకు ఇష్టం ఉండొచ్చు. మంచి పనులు చేస్తే మెచ్చుకోవచ్చు. తప్పులేదు.
అయితే మోదీకి తన ఇష్టాన్ని చెప్పడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవచ్చు. నేరుగా వెళ్లి తన అభిమానాన్ని, ప్రేమను తెలియచేయడంలో తప్పు లేదు. కాని మోదీ ఈయన్ని ప్రత్యేకంగా పార్టీలో చేరాలని ఆహ్వానించడమేమిటి? మోహన్ బాబు ఓ సెలబ్రిటీ. కాని గొప్ప నాయకుడు కాడు కదా. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే నేత కాడు కదా. అయినప్పటికీ ప్రత్యేకంగా ఆహ్వానించారంటే అది ఆయన సొంతంగా చేసిన పనా? ఎవరైనా సలహా ఇచ్చారా?
మోహన్‌బాబు గురించి రాష్ట్ర బీజేపీ నాయకులు ముందుగా ప్రధానికి బ్రీఫింగ్ ఇవ్వకపోతే ఆయన అంతసేపు సమయం కేటాయిస్తారా? పార్టీలోకి ఆహ్వానిస్తారా? మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మి ‘డైనమిక్ ప్రధాని’ అంటూ ట్విట్టర్లో గొప్పగా రాసింది. మీడియాకు కూడా అదే చెప్పింది. విష్ణు కూడా అదే చెప్పాడు. మోహన్ బాబు సీఎం జగన్ కుటుంబానికి బంధువు. కోడలు విరోనిక వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన అమ్మాయే కదా. అలాంటప్పుడు జగన్ పాలన గురించి నెగెటివ్‌గా మాట్లాడడు కదా. ఏది ఏమైనా మోహన్‌బాబు బీజేపీలోకి వెళతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఆయన బీజేపీలోకి వెళతారో, వైకాపాలోనే ఉంటారో త్వరలోనే తేలిపోతుంది.