చంద్రబాబును పొగిడారని రజనీకాంత్ ను వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారు. ఆయన ఆరోగ్యంపైనా.. కుటుంబంపైనా నిందలేస్తున్నారు. ఇంత దారుణంగా మాట్లాడుతూంటే.. రజనీకాంత్ ఆప్తమిత్రుడు .. వైసీపీ గెలుపు కోసం పని చేసిన మోహన్ బాబు మాత్రం నోరెత్తడం లేదు. అసలు రజనీ తప్పు లేకపోయినా ఆయనకు మద్దతుగా ఓ మాట మాట్లాడేందుకు మోహన్ బాబు సిద్ధం కాకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
రజనీకాంత్ వైసీపీపై విమర్శలు చేసి ఉంటే.. జగన్ పాలనను ఖండించి ఉంటే… ఆ పార్టీ నేతలు విమర్శలు చేసినా ఓ అర్థం ఉండేది. అలా చేసినా ఇలాంటి బూతులు మాత్రం మాట్లాడకూడదు. కానీ వైసీపీ నేతలు బరి తెగించారు. మానసిక దాడి చేస్తున్నారు. రజనీ కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని కించ పరుస్తున్నారు. అదంతా తప్పు అని చెప్పాల్సిన వారు మాత్రం నోరు మెదపడం లేదు. మోహన్ బాబు..మౌనం ఈ విషయం ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. రజనీ ని ఎంతో ఆప్తమిత్రుడిగా చెప్పుకుంటారు..మరి ఆయనపై వైసీపీ నేతలు గొలుసులు తెంచుకుని ఎగబడుతూంటే.. ఎందుకు ఖండించడం లేదు.
మోహన్ బాబు.. వైసీపీలో ఉన్నారు. అధికారికంగా ఆయన వైసీపీ సభ్యుడు. ఈ ప్రభుత్వం రావడానికి ఆయన కూడా సాయం చేశారు. గత ప్రభుత్వంపై ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే రోడ్ పై డ్రామాలు వేశారు. ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి చేయాల్సింది చేశారు. అందుకే ఇప్పుడు ఆయన కూడా మాట్లాడాల్సి ఉందన్న వాదన సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఏపీలో ఈ వైపరీత్యానికి ఆయన కూడా బాధ్యుడేనని.. స్పందించాల్సిందేనని అంటున్నారు. మరి మోహన్ బాబు వింటున్నారా ?