ఇంటర్ ఫలితాల్లో మార్కులు తారుమారవడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులదే తొందరపాటు అంటున్నారు విద్యానికేతన్ విద్యాసంస్థ అధినేత మోహన్ బాబు. తెలంగాణలో ఇంటర్ పరీక్షల విషయంలో ఏర్పడిన గందరగోళం నేపధ్యంలో… సోషల్ మీడియాలో మోహన్ బాబు ఎందుకు స్పందించడం లేదని.. సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఎన్నికలకు ముందు ఏపీలో.. ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం.. విద్యార్థులను తీసుకుని రోడ్డెక్కిన ఆయన…తెలంగాణలో నివాసం ఉంటూ.. అక్కడ ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ఎందుకు ఏమీ మాట్లాడటం లేదని విమర్శలు వచ్చాయి. కేసీఆర్ అంటే భయపడుతున్నారని… నెటిజన్లు మండిపడ్డారు. ఈ విమర్శల నడుమ దాదాపుగా వారం రోజుల తర్వాత మోహన్ బాబు స్పందించారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులే తొందరపడ్డారని… తీర్మానించారు. పిల్లలు తొందరపడి.. తమ తల్లిదండ్రులను బాధపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం స్పందించిందని.. తప్పు చేసిన వారిని శిక్షిస్తుందని తెలిపారు. తెలంగాణలోని విద్యావేత్తలందరూ.. ఇంటర్ బోర్డును తీవ్రంగా తప్పు పడుతున్నారు. కొన్ని వేల మంది మార్కులు.. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లే తారుమారయ్యాయని… బయటపడింది. ఈ విషయంపై… ఎంతో మంది విద్యార్థులు.. మానసిక క్షోభ అనుభవించారు. అయినప్పటికీ.. మోహన్ బాబు.. ఇంటర్ బోర్డు తీరుపై కానీ… ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపైనా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆత్మహత్య చేసుకున్న పిల్లలదే తప్పన్నట్లుగా స్టేట్ మెంట్ ఇచ్చారు. కొసమెరుపేమిటంటే.. మంచు విష్ణు కొద్ది రోజుల కిందట.. ఓ ప్రకటన చేసి.. విద్యార్థుల తల్లిదండ్రులదే తప్పనట్లుగా.. వారిని రకరకాలుగా… ఒత్తిడికి గురి చేసి.. చదివిస్తున్నారన్నట్లుగా పోస్టు పెట్టారు. ఇప్పుడు మోహన్ బాబు మాత్రం.. ఆ తప్పు.. ఆత్మహత్య చేసుకున్న పిల్లల మీదే వేసేశారు.
మరో వైపు మంచు విష్ణుకు కూడా… తాము కేసీఆర్ , కేటీఆర్ లకు భయపడుతున్నామని వస్తున్న విమర్శలపై స్పందించారు. తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూనే… కేసీఆర్, కేటీఆర్ లను పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ డిక్టేటర్ కాదని… ఫైర్ బ్రాండ్ అని వీర తాడు వేశారు. కేటీఆర్ హార్డ్ వర్కింగ్ లీడర్ అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయం విషయంలో వారిపై ఒక్క విమర్శ చేయాడనికి కూడా.. తండ్రీ కొడుకులు… సాహసహించలేదని.. నెటిజన్లు ఈ ప్రకటనల తర్వాత మళ్లీ విమర్శలు ప్రారంభించారు.