అరిస్తే చరుస్తా.. చరిస్తే కరుస్తా… డైలాగ్ కంప్లీట్ చేయడం ఎందుకు? ఆల్రెడీ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మీ హార్టులోకి, మైండులోకి వచ్చేసుంటారు కదా! సోమవారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం అధ్యక్షుడి(చైర్మన్)గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో బ్రాహ్మణుల ఉద్దేశిస్తూ మోహన్ బాబు చెప్పిన డైలాగులు కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయి. ‘బ్రాహ్మణులు నన్ను ప్రేమిస్తే నేనూ వాళ్లను ప్రేమిస్తా’ అన్నట్టు మంచి మాటలు మోహన్ బాబు నోటి నుంచి బయటకు వచ్చాయి.
“అయ్యా… బ్రాహ్మణోత్తములారా! కమ్మ, రెడ్డి, కాపు, వాళ్లూ వీళ్లూ అని ఎలా కులాలు ఉన్నాయో… అలాగే, మీలో కొన్ని శాఖలున్నాయి. గొడవలొద్దు. నన్ను ప్రేమించండి. మిమ్మల్ని ప్రేమిస్తాను. మా అల్లుడు కూడా బ్రాహ్మణోత్తముడు. కాబట్టి, కలసి మెలిసి పోదాం” – మోహన్ బాబు వెర్షన్ ఇది. ప్రమాణ స్వీకారం మధ్యలో బ్రాహ్మణుల గురించి అంత నొక్కి వక్కాణించాల్సిన అవసరం ఏమొచ్చింది? ‘నన్ను ప్రేమించండి. మిమ్మల్ని ప్రేమిస్తా’ అనడం ఎందుకు? అనే డౌట్ కొందరికి వచ్చింది. సుకుమార్ బట్టర్ ఫ్లై థియరీ అప్లై చేస్తే ఆన్సర్ దొరకడం పెద్ద కష్టం ఏం కాదులెండి.
మంచు విష్ణు ‘దేనికైనా రెడీ’ విడుదల తర్వాత బ్రాహ్మణులకు, మంచు ఫామిలీకి మధ్య జరిగిన వివాదాలను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ‘దేనికైనా రెడీ’లో తమను చూపించిన విధానం పట్ల బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేయడం, తర్వాత జరిగిన వివాదాలు, మంచు విష్ణు చేయి చేసుకునే వరకూ వెళ్లడం టీవీల్లో ప్రతి ఒక్కరూ చూశారు. మంచు ఫ్యామిలీపై అప్పట్లో బ్రాహ్మణ వ్యతిరేకిగా ముద్ర పడింది. అదంతా మనసులో పెట్టుకుని మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారా? లేదా సాధారణంగా వచ్చాయా? ఆయన మాత్రమే చెప్పగలరు. ఇక, ‘దేనికైనా రెడీ’ తర్వాత మంచు విష్ణు మళ్ళీ బ్రాహ్మణుడిగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలకు జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ‘దేనికైనా రెడీ’ విడుదల సమయంలో జరిగిన అంశాలను దృష్టిలో పెట్టుకుని బ్రాహ్మణుల నేపథ్యంలో సినిమా ఎందుకని ఆయన అనుకున్నారట. కథలో మంచి సెంటిమెంట్ ఉండడంతో చేశామనీ, బ్రాహ్మణులు గర్వపడేలా ఉంటుందనీ నాగేశ్వరరెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద బ్రాహ్మణులతో సఖ్యత కోసం మంచు కుటుంబం మంచి ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థం అవుతోంది.