ఆయనంతే.. ఆయన రూటే సెపరేటు! తను చెప్పదలచుకున్నది చెప్పకుండా ఉండలేరు. కానీ చెప్పినట్లుగా కనిపించకూడదని మాత్రం కోరుకుంటారు. కానీ చెప్పదలచుకున్న సంగతి జనానికి రీచ్ అయిపోవాలనుకుంటారు! అంతలోనే అసలు సంగతి మళ్లీ చెబుతా అంటూ సస్పెన్స్ పెట్టినట్లుగా ఒక ట్విస్టును జత చేయాలని ముచ్చటపడతారు! ఇంతకూ చెప్పినట్టా? చెప్పనట్టా? మీకు ఏమైనా అర్థం అయిందా?
అదే మరి.. అందుకే అంటున్నది.. ఆయన రూటే సెపరేటు.. ఇంతకూ ఆయన ఎవరో అర్థమైంది కదా.. ఆయనే డైలాగ్ కింగ్, పెదరాయుడు మోహన్‌బాబు! తాజాగా బుధవారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. తాను త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు మోహన్‌బాబు ప్రకటించారు. ఏ పార్టీలో చేరబోయేది తర్వాత ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న పార్టీలోనే తాను చేరబోతున్నాను అని కూడా ఒక ట్విస్టెడ్ డైలాగు సంధించారు.
అయితే ‘ఏ పార్టీ’ అనేది త్వరలో చెబుతా అంటూ మోహన్‌బాబు సెలవిస్తున్నారు గానీ.. ఆయన మాటల్లోనే.. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా తేటతెల్లం అయిపోతున్నది. ఎందుకంటే.. ఈ సందర్భంగా ఉన్న పార్టీలు వీడి కొత్త పార్టీల్లోకి ఫిరాయిస్తున్న జంప్ జిలానీలను మోహన్‌బాబు తూర్పారపట్టేశారు. ఈ జంప్‌జిలానీలు ఎంగిలి మెతుకులు తినేవారితో సమానం అంటూ తనదైన శైలిలో తిట్టిపోశారు.
నిజానికి మోహన్‌బాబుకు రాజకీయాలు కొత్తకాదు. రామారావు హయాంలోనే ఆయన రాజ్యసభ ఎంపీగా చేశారు. సుశీల్‌కుమార్ షిండే వంటి దిగ్గజాలు అప్పట్లో ఆయనకు అత్యంత సన్నిహితులైన సహచరులు కూడా! వారితో ఆయన మైత్రీబంధం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. అయితే ఇటీవలి కాలంలో ఏర్పడిన బంధుత్వం దృష్ట్యా ఆయన ఇప్పుడు వైకాపాలో చేరుతారనే ప్రచారం పెద్దగా నడుస్తోంది.