నటుడు మోహన్ బాబు సినిమాల్లోనే కాదు బయట కూడా పొలిటికల్ పంచ్‌లు బాగానే పేలుస్తారు. ఆయనకు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. అప్పట్లో ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీ భక్తుడు. చంద్రబాబు నాయుడు కోసం కూడా టీడీపీ తరపునే ఉండాల్సివచ్చింది. మొన్నటి ఎన్నికల్లో అయితే… వైకాపా జెంటా పట్టుకున్నారు. ఆ పార్టీ కోసం ప్రచారం కూడా చేశారు. కట్ చేస్తే.. మోడీని కీర్తిస్తూ కామెంట్లు విసిరారు. వ్యక్తిగతంగా కలిసి ఫొటోలు తీసుకుని… హడావుడి చేశారు. మంచు లక్ష్మి బీజేపీలో చేరబోతోందని ప్రచారం జరిగింది. కానీ ఆ తరవాత.. ఎలాంటి అలికిడి వినిపించలేదు. భవిష్యత్తులో మోహన్‌బాబు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతారని ప్రచారం జరిగింది. అయితే మోహన్ బాబు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆయన రాజకీయ సన్యాసం తీసేసుకున్నారు.
“మళ్లీ నేను రాజకీయాల్లోకి రాను. ఆ పొరపాటు మళ్లీ చేయను. అప్పట్లో అన్న ఎన్టీఆర్ కోసం టీడీపీ కోసం ప్రచారం చేశాను. చంద్రబాబు నాకు బంధువు. అందుకే టీడీపీ వైపున ఉన్నాను. ఆ తరవాత జగన్ కూడా మా బంధువే. కాబట్టి.. వైకాపా తరపున మాట్లాడను. నా బాధ్యత అయిపోయింది. ఇక మీదట రాజకీయాల గురించి మాట్లాడను..“ అంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. కాకపోతే.. మోడీ పాలనను ఆయన మెచ్చుకున్నారు. మోడీ దేశాన్ని బాగా నడిపిస్తున్నారని, మనుషులు కొన్ని తప్పులు చేస్తారని, తప్పులు చేయని వాళ్లే ఉండరని, మోడీ కొన్ని పొరపాట్లు చేసినా తను హిట్లర్ లాంటి వాడని కితాబిచ్చారు.
ఇటీవల పేర్నినాని మోహన్ బాబు ఇంటకి వెళ్లి కలిసొచ్చారు. ఆ ఫొటోని మంచు విష్ణు ట్విట్టర్లో పంచుకోవడం, దానిపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరగడం.. వీటిపై కూడా మోహన్ బాబు స్పందించారు. పేర్ని నానితో తనకు ఎప్పటి నుంచో స్నేహం ఉందని, ఓ స్నేహితుడిగా తన ఇంటికి వచ్చాడని, అంతే తప్ప రాజకీయాలు మాట్లాడలేదని, ఆ మాత్రం దానికే చిలవలు పలవలుగా రాసేశారన్నారు మోహన్ బాబు.