సినీ నటుడు , విద్యావేత్త మోహన్ బాబు తిరుపతిలో తన పేరు మీద మోహన్ బాబు యూనివర్శిటీని ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. మోహన్ బాబు యూనివర్శిటీ లోగోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట ప్రారంభమైన విద్యానికేతన్ కల్పవృక్షంగా ఎదిగిందన్నారు. అందరి సపోర్ట్ లభిస్తుందని మోహన్ బాబు నమ్మకం వ్యక్తం చేశారు.
శ్రీవిద్యానికేతన్ పేరుతో ఇప్పటికే తిరుపతి సమీపంలో మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థలు ఉన్నాయి . అందులో ఇంజినీరింగ్ వరకూ అన్ని రకాల కోర్సులు లభిస్తాయి. అయితే మోహన్ బాబు విద్యానికేతన్ను యూనిర్శిటీగా మారుస్తున్నారా లేకపోతే.. విడిగా మోహన్ బాబు యూనివర్శిటీకి అనుమతులు పొందారా అన్నదానిపై స్పష్టత లేదు.
ప్రైవేటు యూనివర్శిటీలుగా అనుమతులు పొందాలంటే చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు కొత్తగా సంస్థను పెడతామంటే అనుమతులు లభించవు. అందుకే విద్యానికేతన్ కింద ఉన్న విద్యాసంస్థలకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించి మోహన్ బాబు యూనివర్శిటీగా రూపకల్పన చేస్తారని భావిస్తున్నారు. మోహన్ బాబు పేరు మీదనే యూనివర్శిటీ ఏర్పాటు కావడం ఓ గౌరవంగా చెప్పుకోవచ్చు.