ఎన్టీఆర్ బయోపిక్‌కి సర్వ హంగులూ సిద్ధమవుతున్నాయి. మెల్లమెల్లగా ఒకొక్క పేరు ఖరారవుతూ వెళ్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా… ఏఎన్నార్‌గా నాగచైతన్య కనిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మోహన్ బాబు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది. నందమూరి కుటుంబానికీ మంచు ఫ్యామిలీకి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నా అన్న ఎన్టీఆర్’ అంటూ… వీలైన ప్రతీసారీ ఆయన పేరు తలచుకుంటూనే ఉంటారు మోహన్ బాబు. ఎన్టీఆర్ పిలుపుతోనే మోహన్ బాబు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నందమూరి బాలకృష్ణతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కుటుంబంపై ఉన్న అభిమానంతోనే ‘ఊ కొడతారా, ఉలిక్కి పడతారా’లో ఓ కీలక పాత్ర పోషించారు బాలయ్య. ఇప్పుడు ఆ అభిమానంతోనే.. `ఎన్టీఆర్` బయోపిక్‌లో మోహన్ బాబుకి ఓ పాత్ర ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అయితే మోహన్ బాబు ఏ పాత్రలో కనిపిస్తారన్నది మాత్రం సస్పెన్స్. ‘మహానటి’లో ఆయన ఎస్వీఆర్‌గా కనిపించారు. ఈసారి అందుకు భిన్నమైన పాత్రే దక్కబోతోందని సమాచారం.