రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం `ఆకాశవాణి`. అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో హీరో పాత్ర అంటూ ఏదీ ఉండదట. విలన్ పాత్ర చుట్టూనే ఈ సినిమా తిరుగుతుందని సమాచారం. ఆ లెక్కన ప్రతినాయకుడే హీరో అనుకోవాలి. అలాంటి ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తే బాగుంటుందన్నది చిత్రబృందం అభిప్రాయం. సాయికుమార్ తమ్ముడు రవి శంకర్ పేరుని పరిశీలించారు. అయితే.. ఆ పాత్రకి తగినంత వెయిటేజీ ఉండదేమో అన్నది కార్తికేయ అభిప్రాయం. మోహన్‌లాల్ లాంటి నటుడైతే.. ఈ సినిమాకి మార్కెట్ కూడా పెరుగుతుందని భావిస్తున్నార్ట. కాకపోతే మోహన్ లాల్ పారితోషికం చుక్కల్లో ఉంటుంది. కానీ ఈసినిమా రూ.4 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపొందుతోంది. రూ.4 కోట్లకు ఒక్క రూపాయి కూడా పెరక్కూడదని చిత్రబృందం భావిస్తోంది. మోహన్ లాల్‌ని తీసుకుంటే.. మలయాళ మార్కెట్ ఉంటుంది. ఆ లెక్కన రిస్క్ తక్కువైపోతుంది. అందుకే.. బడ్జెట్లో మినహాయింపు ఇచ్చి, మోహన్ లాల్ ని తీసుకోవాలని కార్తికేయ భావిస్తున్నాడట. మోహన్ లాల్ `నో` అంటే.. మరో ఆప్షన్ కూడా ఈ చిత్రబృందం దగ్గర రెడీగా ఉంది. తనే రాజశేఖర్. ప్రతినాయక పాత్రలో రాజశేఖర్ బాగుంటాడని… మోహన్ లాల్ కుదరకపోతే.. రాజశేఖర్ ని ఎంచుకోవాలని, రాజశేఖర్ ఉంటే.. బడ్జెట్లోనూ వెసులుబాటు ఉంటుందని అనుకుంటున్నార్ట. ప్రస్తుతం కార్తికేయ తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ హడావుడి పూర్తయ్యాకే ప్రతినాయకుడి అన్వేషణ మొదలవుతుంది.