దేశాన్ని కుదిపేసిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఏమాత్రం అంచనాలు లేకుండా, ఏమాత్రం ప్రమోషన్లు చేయకుండానే పాన్ ఇండియా స్థాయిలో విజయ ఢంకా మోగించింది. కన్నడ చిత్రసీమ స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు ‘కాంతార 2’ వస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘కాంతార’ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకొని, పార్ట్ 2లో క్రేజీ స్టార్స్‌ని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నాడు రిషబ్ శెట్టి. అందులో భాగంగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ని టీమ్‌లోకి తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఇటీవల రిషబ్ శెట్టి మోహన్‌లాల్‌ని కలుసుకొన్నారు. ఆ ఫొటోని సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు. దాన్ని బట్టే ‘కాంతార 2’లో మోహన్ లాల్ ఉన్నారన్న అనుమానాలు మరింతగా బలపడ్డాయి. మోహన్ లాల్ మాత్రమే కాదు, ఈసినిమాలో చాలామంది స్టార్లకు చోటుందని తెలుస్తోంది. తెలుగు నుంచి కూడా ఓ పేరున్న హీరోని తీసుకొనే ప్రయత్నాల్లో ఉన్నాడు రిషబ్ శెట్టి. చిన్న పాత్రలనైనా, పెద్ద స్టార్స్ తో చేయించడం ఈనాటి ట్రెండ్ గా మారింది. రిషబ్ శెట్టి కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.
ఒక రకంగా చెప్పాలంటే ఇది సీక్వెల్ కాదు. ప్రీక్వెల్. ‘కాంతార’ కథ కంటే ముందు జరిగిన కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం రిషబ్ యుద్ధ విద్యలలో శిక్షణ తీసుకొన్నాడు. గుర్రపు స్వారీ కూడా నేర్చుకొన్నాడు. రిషబ్ సొంత ఊరులోనే పెద్ద సెట్ వేసి, ఈ సినిమాని 4 షెడ్యూల్స్ లో పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఓ కొలిక్కి వచ్చేశాయి. త్వరలోనే చిత్రీకరణ మొదలెడతారు.