మోహన్ లాల్ నటన అందరినీ ఇష్టం. ఆయనతో సినిమా చేయాలని అందరి దర్శకులకీ వుంటుంది. దర్శకుడు శంకర్ కి కూడా ఈ కోరిక ఎప్పటినుంచో వుంది. తమిళ్ లో మోహన్ లాల్ చేసిన ‘ఇద్దరు’ సినిమా నుంచి మోహన్ లాల్ అంటే అమితమైన ఇష్టం ఏర్పడింది శంకర్ కి. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో స్వయంగా చెప్పారు. ఎప్పటికైనా ఆయనతో ఓ పాత్ర చేయించాలని అనుకున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇందులో ఓ కీలక పాత్ర వుంది. ఆ పాత్ర కోసం మోహన్ లాల్ ని సంప్రదించారు. అయితే శంకర్ ఊహించని రెస్పాన్ వచ్చింది. పాత్రలో విలనీ లక్షణాలు వున్నాయని, ప్రస్తుతం విలనీ పాత్రలు పోషించడం లేదని చాలా సున్నితంగా తిరస్కరించారట మోహన్ లాల్. ఆయన నుంచి ఇలాంటి రెస్పాన్స్ వూహించలేదు శంకర్. మోహన్ లాల్ నటనకు ఆస్కారం వున్న పాత్ర చేస్తారాని భావించారు.
నిజానికి మోహన్ లాల్ కి తెలుగు లో కూడా హీరో ఇమేజే వుంది. జనతా గ్యారేజ్, మనమంతా చిత్రాలు ఆయన్ని తెలుగు ప్రేక్షకులని మరింత దగ్గర చేశాయి. ఇప్పుడు విలన్ పాత్ర వేయడం ఆయనకి నచ్చలేదేమో. మొత్తానికి శంకర్ కి నిరాశే మిగిలింది.