హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు. తన వారసుడిగా తన కుమారుడు సినిమాలలోకి వస్తాడని ప్రకటించారు. బాలయ్య తాజా చిత్రం ‘డిక్టేటర్’ ఆడియో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ విజయోత్సవ కార్యక్రమం నిన్న హైదరాబాద్లో జరిగింది. నటీనటులు, సాంకేతిక నిపుణులకు బాలయ్య జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనకు మరెవ్వరూ పోటీ లేరని బాలకృష్ణ అన్నారు. నువ్వెంత అనుకునేవాడికి నియంత తమ డిక్టేటర్ అని చెప్పారు. బతికున్నంతవరకు సినిమాలు చేస్తూనే ఉంటానని తెలిపారు. తన ఇన్నేళ్ళ కెరీర్లో ఎన్నో మంచి పాత్రలు పోషించే అవకాశం లభించిందని అన్నారు. అదంతా తన అదృష్టమని చెప్పారు. జానపదాలు, పౌరాణికాలు, సోషియో ఫాంటసీ వంటి విభిన్నమైన చిత్రాలు చేశానని అన్నారు. ఎప్పుడూ తన సినిమాలే తనకు పోటీ అని భావిస్తుంటానని చెప్పారు. అంజలి లాంటి కథానాయికలు దొరికితే అద్భుతాలు సృష్టించొచ్చని అన్నారు. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష కథానాయికలుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీవాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించటం విశేషం. నందమూరి నటవారసుడి గురించి చర్చ జరుగుతుండగా బాలయ్య తన వారసుడు మోక్షజ్ఞే తన వారసుడని ప్రకటించటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, తన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వివిధ మీడియా సంస్థలకిస్తున్న ఇంటర్వ్యూలలో తనకు, బాబాయ్ బాలయ్యకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, విభేదాలు ఉన్నట్లు తానుగానీ, తన బాబాయ్ గానీ చెప్పలేదని అన్నారు.