బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. 2017లో మోక్షజ్ఞ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ విషయాన్ని ఇది వరకే బాలయ్య స్వయంగా ప్రకటించారు కూడా. ఇప్పుడు అందుకోసం రంగం సిద్ధమవుతుంది. మోక్షజ్ఞ కోసం కథలు సిద్ధం చేయమని కొంతమంది దర్శకుల్ని పురమాయించారు బాలయ్య. ఆ జాబితాలో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్లలో బోయపాటి శ్రీను, త్రివిక్రమ్‌లు ముందు వరుసలో ఉన్నారు. బాలయ్యకు బోయపాటికీ మంచి ట్యూనింగ్ ఉంది. అన్నీ కుదిరితే బాలయ్య వందో సినిమా బోయపాటే చేయాలి. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ బాధ్యత ఆయన చేతిలో పెట్టినట్టు తెలుస్తోంది.
బోయపాటి కూడా మోక్షజ్ఞ కోసం ఓ కథ సిద్ధం చేసే పనిలో పడిపోయారట. మరోవైపు మోక్షజ్ఞ సినిమా టేకప్ చేసే అవకాశం త్రివిక్రమ్ కి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తొలి సినిమాతోనే యాక్షన్ దట్టించకుండా ఓ సింపుల్ లవ్ స్టోరీతో మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేయాలనుకొంటే త్రివిక్రమ్‌కి మించిన ఆప్షన్ లేదని బాలయ్యకు సన్నిహితులు సూచిస్తున్నార్ట. అందుకే.. త్రివిక్రమ్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. వీరిద్దరి కథల్లో ఏదో ఒకటి ఖాయం చేసి 2016 చివరికల్లా బాలయ్య ఓ నిర్ణయానికి వచ్చేస్తారని, 2017 వేసవిలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఇద్దరు దర్శకులలో మోక్షజ్ఞ ఎవరి చేతిలో పడినా.. నందమూరి ఫ్యాన్స్‌కి పండగే.