నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమా ఓకే అయ్యింది. ఇప్పుడు… క్లాప్ కొట్టడానికి ముహూర్తం కూడా ఖరారైంది. డిసెంబరు 2న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెడతారు. కథానాయికగా రవీనాటాండన్ కుమార్తె రషా తథానీ దాదాపుగా ఖాయమైపోయినట్టే. తనపై ఓ లుక్ టెస్ట్ కూడా జరిపినట్టు సమాచారం అందుతోంది. ప్రతినాయకుడిగా కొంతమంది పేర్లు పరిశీలిస్తున్నారు. అందులో రానా కూడా ఉన్నాడు. అయితే రానా కథానాయకుడిగా ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈరెండు సినిమాలకూ డేట్ క్లాష్ వచ్చే అవకాశం ఉన్నందున రానా ఏదీ తేల్చుకోలేకపోతున్నాడని టాక్.
ఈ చిత్రంలో బాలకృష్ణ సైతం కనిపించనున్నారు. అయితే అది అతిథి పాత్ర మాత్రమే. క్లైమాక్స్‌లో బాలయ్య పాత్ర ఎంట్రీ ఉంటుంది. పురాణాలతో టచ్ ఉన్న కథ. మోక్షజ్ఞ అభిమన్యుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మోక్షజ్ఞ అభిమన్యుడు అయితే బాలయ్య పాత్ర కచ్చితంగా శ్రీకృష్ణుడే. తొలి సినిమాలో తండ్రీ కొడుకుల్ని ఒకేసారి ఒకే తెరపై చూడడం, అది కూడా పౌరాణిక పాత్రల్లో.. ఇంతకంటే ఫ్యాన్స్‌కు కావల్సిందేముంది?