ఓ హీరో కోసం అనుకున్న కథ, మరో హీరో చేయడం చిత్రసీమలో మామూలే. అలా కొన్ని వందల కథలు చేతులు మారి ఉంటాయి. కానీ ఏ ఒక్కసందర్భంలోనూ.. `నేను ఆ కథని వదులుకున్నా.. నువ్వు కూడా చేయకు` అని సాటి హీరోకి మరో హీరో చెప్పలేదేమో. కానీ.. ఆ సందర్భం ఓసారి వచ్చింది. అక్కినేని, ఎన్టీఆర్ విషయంలో.
1960 నాటి సంగతి ఇది. బిఏ సుబ్బారావు అనే దర్శకుడు `రాణీ రత్నప్రభ` అనే కథ పట్టుకుని నాగేశ్వరరావు దగ్గరకు వెళ్లారు. ఆ కథ నాగేశ్వరరావుకి పెద్దగా నచ్చలేదు. కథంతా దాదాపు కథానాయికగా చుట్టూనే తిరగడం అందుకు ఓ కారణం. `ఇందులో అంజలీదేవి పాత్రే ఎక్కువ కదా.. నేను చేయడానికి ఏముంది` అంటూ నాగేశ్వరరావు ఆ సినిమాని తిరస్కరించారు. దాంతో సుబ్బారావు ఈ ప్రాజెక్టుని ఎన్టీఆర్ తో చేయాలని ఫిక్సయ్యారు. ఈ కాంబినేషన్లో `రాణీ రత్న ప్రభ` సినిమా వస్తోందన్న వార్త తెలిసి… ఎన్టీఆర్‌కి ఫోన్ చేశార్ట నాగేశ్వరరావు.
`బ్రదర్.. రాణీ రత్న ప్రభ అనే సినిమా మీరు చేస్తున్నారని తెలిసింది. ఆ కథ నాకూ వినిపించారు. నాకు ఏమాత్రం నచ్చలేదు. మీ ఇమేజ్‌కి కూడా అది సరిపడదు. ఈ సినిమా చేయకపోవడమే మంచిది` అని సలహా ఇచ్చారు.
కానీ ఎన్టీఆర్ మాత్రం `బిఏ సుబ్బారావు గారు నాకు బాగా కావల్సిన మనిషి. ఇండ్రస్ట్రీలో నేను అడుగుపెట్టడానికి కారణం ఆయనే. నేను ఆయనకు మాటిచ్చాను. ఈ పరిస్థితుల్లో నేనిచ్చిన మాట వెనక్కి తీసుకోలేను` అనేశారు.
ఇచ్చిన మాట ప్రకారమే.. ఎన్టీఆర్ ఆ సినిమా చేసేశారు. షూటింగ్ అంతా అయిపోయింది. రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది.
రేపు ఈ సినిమా విడుదల అనగా… ఆరోజు రాత్రి నాగేశ్వరరావు నిద్రపోలేదట. `బ్రదర్‌కి ఈ సినిమా చేయొద్దని చెప్పా. ఆయన చేశారు. ఇప్పుడు ఆ సినిమా ఆడుతుందా లేదా? ఆడితే నా జడ్జిమెంట్ పోయినట్టే. ఆడకపోతే.. బ్రదర్ నష్టపోతారు..` అనే ఆలోచనలతో నిద్ర రాలేదట.
తెల్లారి మార్నింగ్ షో అయ్యాక… తనకు అత్యంత నమ్మకస్థుడైన ఓ థియేటర్ యజమానికి ఫోన్ చేసి.. `సినిమా రిజల్ట్ ఏమిటి` అని అడిగార్ట.
`సినిమా ఏం బాలేదండీ. ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా కాదిది` అని చెప్పే వరకూ.. ఆయన టెన్షన్ పడుతూనే ఉన్నార్ట. ఈ విషయాన్ని అక్కినేని తన ఆత్మకథలో రాసుకున్నారు. మరో హీరో సినిమా కోసం ఓ హీరో ఇంతలా ఆలోచించడం, అదీ ఆ సమయంలో తనకు ఏకైక పోటీ దారుడి సినిమా గురించి ఆరాట పడడం విచిత్రమే.
అయితే అక్కినేని మాటలకు, చేష్టలకూ ఎన్టీఆర్ అభిమానులు మరోలా వివరణ ఇచ్చుకున్నారు. `మా హీరో సినిమా ఎక్కడ హిట్టయిపోతుందో అన్న భయంతో.. అక్కినేనికి నిద్ర పట్టి ఉండదు` అని చెప్పుకున్నారు. నిజానికి `రాణీ రత్న ప్రభ` చూడదగ్గ సినిమానే. పాటలు బాగుంటాయి. కాకపోతే… హీరోయిన్ డామినేషన్ ఎక్కువ. మరో హీరో చేసుంటే.. ఇంకాస్త మంచి ఫలితం వచ్చేదేమో..?