బిగ్ బాస్ వల్ల ఉపయోగం ఏమిటి? అని ఎవరైనా అడిగితే.. `పనిలేనివాళ్లని సెలబ్రెటీలను చేస్తుంది. సెలబ్రెటీ డిమాండ్ పెంచుతుంది` అనేయొచ్చేమో.? ఎందుకంటే ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన వాళ్ల డిమాండ్ అలా ఉంది. ముక్కు అవినాష్ ఖాతాలో నాలుగు సినిమాలూ, ఓ కామెడీ షో పడింది. సోహైల్ హీరో అయ్యాడు. అభిజిత్ కి హీరోగా మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు.. మోనాల్ గజ్జర్ కూడా తన తడాఖా చూపిస్తోంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న `అల్లుడు అదుర్స్`లో మోనాల్ గజ్జర్ తో ఓ ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేశారు. ఈ పాట కోసం మోనాల్ ఏకంగా 15 లక్షలు డిమాండ్ చేసిందని సమాచారం. ఇంతకీ ఈ పాట ఉండేది మూడంటే మూడు నిమిషాలే. మోనాల్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలూ రెడీ అయిపోయారు. ఈరోజే మోనాల్ సెట్స్ లోకి అడుగుపెట్టిందని టాక్. బిగ్ బాస్ ద్వారా మోనాల్ కి దాదాపు 30 లక్షలు గిట్టుబాటు అయ్యిందని సమాచారం. `మా` టీవీలో ప్రసారమవుతున్న ఓంకార్ డాన్స్ షో `డాన్స్ ప్లస్` కి జడ్జ్ హోదాలో కనిపించింది. ఈ షో ద్వారా ఎపిసోడ్ కి రూ.50 వేలు ఆర్జించబోతోందట. ఇలాంటి షోలు, ఐటెమ్ సాంగులూ మరో ఒకట్రెండు పడితే చాలు. మోనాల్ సెటిల్ అయిపోయినట్టే.