జాతీయ రాజకీయాలు చేయాలంటే రూ. ఆరు వందల కోట్లు కావాలని.. టీఆర్ఎస్కు అంతకు మించిన శక్తి ఉందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆయన ప్లీనరీలో టీఆర్ఎస్ ఆర్థిక శక్తి గురించి పదే పదే చెప్పారు. అన్ని వందల కోట్ల విరాళాలు ఎవరిచ్చారన్న సంగతిని పక్కన పెడితే… అసలు డబ్బులుంటే జాతీయ రాజకీయాలు చేయవచ్చా… ఆ భారీ నిధులు ఉండటమే అర్హతా అన్న ప్రశ్న ప్రధానంగా ప్రజల్లో వస్తోంది. కేసీఆర్ డబ్బులున్నాయి. .. ఆర్థిక స్థోమత ఉంది కాబట్టి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని అంటున్నారు.
ఇప్పటి రాజకీయాలకు డబ్బుతోటే పని. రాజకీయం వ్యాపారం అయిపోయింది. ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందన్నది చూసుకుంటున్నారు. అందులో సందేహం లేదు. కానీ.. అది అభ్యర్థుల వరకే. రాజకీయాల పార్టీలు మాత్రం ఇంకా ఈ రాజకీయ వ్యాపారంలోకి దిగాయో లేదో స్పష్టత లేదు. అధికారంలోకి వచ్చిన ఐదారేళ్లలోనే బీజేపీకి ఐదువేల కోట్ల డిపాజిట్లు వచ్చినట్లు… టీఆర్ఎస్ కూడా వెయ్యి కోట్ల ఆస్తి సముపార్జించుకుంది. ఎలా వచ్చిందో వారు చెబితేనే తప్పలేదు. కానీ బీజేపీ తాము దక్షిణాదిలో బలపడటానికి కావాల్సినంత సొమ్ము ఉందని చెప్పడం లేదు. తమ దారిలో తాము ప్రయత్నిస్తోంది. కానీ కేసీఆర్ మాత్రం టీఆర్ఎస్ను జాతీయ స్థాయిలో నడిపించడానికి కావాల్సినంత డబ్బు ఉందంటున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తనకు తానుగా ఓ ఇమేజ్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశా దానికి ఖర్చు అవుతుందని కేసీఆర్ భావిస్తూ ఉండవచ్చు. కానీ డబ్బులుంటేనే రాజకీయాలు చేయలేరని అంటున్నారు. రాజకీయాలు చేయడానికి డబ్బు కావాలేమో కానీ.. డబ్బుతోనే రాజకీయాలు చేయలేరని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ ప్రకటించిన టీఆర్ఎస్ ఆర్థిక బలం… దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవడం ఖాయంగా కనిపిస్తోంది.