ఆంధ్రప్రదేశ్లో ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించాలని… పదో తేదీన నంద్యాలలో బహిరంగసభ ఏర్పాటు చేశారు ప్రభుత్వ అధికారులు. అయితే హఠాత్తుగా ఆ పథకాన్ని వాయిదా వేస్తూనిర్ణయం తీసుకున్నారు.అయితే ఇప్పటికే నంద్యాలలో ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. పండుగకు ముందే పథకం నిధులు మీట నొక్కి బ్యాంకు ఖాతాల్లో వేస్తే దాదాపుగా నాలుగు లక్షల మంది ఈబీసీ నేస్తం లబ్దిదారులకు ముందే సంక్రాంతి వచ్చినట్లుగా భావిస్తారని అనుకున్నారు. పథకం తేదీని ప్రకటించడంతో అలాగే అనుకున్నారు. కానీ చివరికి నిరాశే ఎదురయింది.
ఆర్థికంగా వెనుకబడిన తరగతి మహిళల కోసం ఎన్నికల హామీల్లో భాగంగా ఈబీసీ నేస్తం పేరుతో ఈ పథకానికి రూపకల్పన చేసింది ప్రభుత్వం. పథకం కింద అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు మూడు సంవత్సరాల వ్యవధిలో 45 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది జగన్ సర్కార్. అగ్రవర్ణ కులాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఈబీసీ నేస్తం పథకానికి అర్హులు. లబ్ధిదారులకు సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. మూడు సంవత్సరాల వ్యవధిలో 45 వేల రూపాయల మొత్తాన్ని వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తారు.
ఈ పథకానికి ముహుర్తం ఖరారు చేసి ఎందుకు వాయిదా వేశారన్నదానిపై స్పష్టత లేదు. ఆర్థిక కారణాలా లేక.. కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంగా బహిరంగసభలు నిర్వహించకూడదన్న ఉద్దేశంతోనా అన్నది ప్రభుత్వ వర్గాలు ప్రకటించాల్సి ఉంది. సంక్రాంతి తర్వాతే ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తయింది.. వాలంటీర్లు అందరూ.. పదో తేదీన డబ్బులు పడతాయని సమాచారం ఇచ్చారు. ఇప్పుడు వాయిదా పడిందని మళ్లీ సమాచారం ఇవ్వాల్సి ఉంది.