లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని… స్పీకర్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించగానే ముఖ్యమంత్రి చంద్రబాబు… అమరావతిలో అలర్ట్ అయ్యారు. అవిశ్వాస తీర్మానంపై బీజేపీ వ్యూహానికి ప్రతివ్యూహంతో సమర్ధవంతంగా అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఏపీ విషయంలో కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశ ప్రజలకు తెలిసే విధంగా లోక్ సభ సాక్షిగా ప్రభావవంతంగా వెల్లడించాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం జరిపిన సీఎం… ఎపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ఇప్పటి వరకు అమలు చేసిన హామీలు, ఇంకా చేయాల్సిన పనులు, ఆర్ధిక లోటు, ఇప్పటి వరకు ఇచ్చిన నిధులు, ప్రత్యేక హోదా, వంటి అంశాలపై స్పష్టమైన నోట్‌ను తయారు చేయించారు. దాన్ని ఎంపీలకు పంపించారు.
అవిశ్వాస తీర్మానం సందర్భంగా నోటీసు ఇచ్చిన ఎంపీ కేశినేని నాని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడితో మాట్లాడించాలని చంద్రబాబు నిర్ణయించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రధాని జవాబు అనంతరం అవకాశం వస్తే మిగతా ఎంపీలతో కూడా మాట్లాడిస్తారు. ఎంపీలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు యనమల రామకృష్ణుడు, కుటుంబరావు, విభజన సమస్యల పరిష్కార కమిటీలో ఉన్న సీనియర్ అధికారులు ప్రేమ్ చంద్రారెడ్డి, బాలసుబ్రహ్మణ్యంలను ఢిల్లీకి పంపించారు.
అవిశ్వాస తీర్మానంపై భావసారూప్యత ఉన్న మిగతా పార్టీలను కూడా కలుపుకువెళ్లాలని సీఎం ఎంపీలకు సూచించారు. కొన్ని పార్టీల అధినేతలతో చంద్రబాబు స్వయంగా మాట్లాడుతున్నారు. ఈ రోజంతా చంద్రబాబు.. అవిశ్వాస వ్యూహాల్లోనే ఉండనున్నారు. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఢిల్లీలో ఉన్న ఎంపీలు, అక్కడ ఉన్న పార్టీ నేతలతో సీఎం ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేస్తారు. మొత్తానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని చంద్రబాబు గట్టి పట్టదులతో ఉన్నారు.