రెడీమేడ్ ఇళ్లు కొనుగోలు చేయడం చాలా తక్కువ. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను బుక్ చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. భూమి పూజ చేసిన ప్రాజెక్టులను సగంపైగా బుక్ చేసుకుంటున్న మార్కెట్ ట్రెండ్ కనిపిస్తోంది. అవి చేతికి వచ్చే సరికి మూడేళ్లు పడుతుంది. అప్పటి వరకూ ముందుగా ఈఎంఐ చెల్లించాలంటే ఇబ్బందికరమే. ఓ వైపు ఇంటిరెంట్.. మరో వైపు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఏదైనా కొత్తగా నిర్మాణం ప్రారంభించిన ప్రాజెక్టులో అయితే ఫ్లాట్ బుక్ చేసుకుంటే ఇరవై శాతం వరకూ కట్టించుకుంటారు.తర్వాత ఫ్లాట్ ప్రోగ్రెస్ను బట్టి మిగతా మొత్తం చెల్లించాలి. అత్యధిక మంది బ్యాంక్ లోన్లకు వెళ్తారు. అందుకే .. అర్జంట్ గా లోన్లు తీసుకుని తమకు కట్టేయాలని .. నిర్మాణసంస్థలు ఒత్తిడి చేస్తూ ఉంటాయి. లోన్ తీసుకున్నప్పటి నుంచి ఈఎంఐ కట్టాల్సిందే. అందుకే ప్రాజెక్టు ఓ రూపానికి వచ్చి .. ఐదారు నెలల్లో హ్యాండోవర్ చేస్తారనుకున్నప్పుడే లోన్ విషయంలో తదుపరి నిర్ణయాలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం నిపుణుల్లో వినిపిస్తోంది.
ఒక వేళ ముందుగానే లోన్లు తీసుకోవాలని నిర్మాణ సంస్థ ఒత్తిడిచేస్తే ప్రీ ఈఎంఐ ఆఫర్ కోసం ఒత్తిడి చేయవచ్చు. అంటే.. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకూ.. హ్యాండోవర్ చేసే వరకూ ఈఎంఐలు లేకుండాచూసే బాధ్యత నిర్మాణసంస్థకే అప్పగించాలి. బ్యాంకులతో ఆయా నిర్మాణ సంస్థలు ఒప్పందాలు చేసుకుని ఈ ఆఫర్ ఇస్తాయి. పలు సంస్థలు ప్రీ ఈఎంఐ ఆఫర్లు ఇస్తున్నాయి. సాధారణంగా సొంత ఇల్లు కొనుగోలు చేసేవారికి.. ఇంటి అద్దెతో పాటు ఈఎంఐ కట్టుకోవడానికి భారం అవుతుంది. ఇలాంటివారు ఫ్లాట్ హ్యాండోవర్ అయ్యాకే ఈఎంఐలు ఉండేలా చూసుకోవడం అత్యుత్తమం.