మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నేతలకు పండగ తెచ్చి పెట్టాయి. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే.. వారి కోసం టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. అత్యధిక శాతం స్థానిక సంస్థలు టీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఆ లీడర్లందరికీ ఇప్పుడు మంచి డిమాండ్ వచ్చింది. టీఆర్ఎస్, బీజేపీల నుంచి మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో చాలా మంది నేతలు టెంప్ట్ అవుతున్నారు. పార్టీలు మారిపోతున్నారు . ఇటీవలి కాలలో వరుసగా టీఆర్ఎస్లో చేరిపోతున్నారు.
ఇక రాజగోపాల్ రెడ్డికి ముఖ్యమైన టాస్క్.. కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలందర్నీ తన వైపు తిప్పుకోవడం. అయితే చాలా మంది నేతలు ఆయనతో నడవడానికి సిద్దంగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ నుంచి వస్తున్న ఆఫర్లతో మాకేంటి అనే పరిస్థితిలో పడిపోయారు. దీంతో రాజగోపాల్ రెడ్డి కూడా వారిని తనతో పాటు పార్టీ మారేలా చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఖర్చు పెట్టుకుంటున్నారు. ఓ వైపు బీజేపీ.. మరో వైపు టీఆర్ఎస్ ఇలా ఆఫర్లు ఇస్తూండటంతో మునుగోడులో ఇతర పార్టీల నేతలకు అనుకోని అదృష్టం వచ్చి పడింది.
కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్‌లో పడి వలస పోతూండటంతో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. అక్కడ అభ్యర్థిగా భావిస్తున్న చల్లమల్ల కృష్ణారెడ్డి అనేవ్యక్తిని రంగంలోకి దింపారు. పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని.. వారి కోరికలు వీలైనంత వరకూ తీర్చి అయినా సరే పార్టీలో ఉంచాలని మిషన్ ఇచ్చారు. తాను కూడా .. ఇరవయ్యో తారీఖు నుంచి మునుగోడులోనే ఉంటానని .. అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని.. కేడర్‌కు రేవంత్ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. క్యాడర్ ను ఎంత వరకూ నిలుపుకుంటే అంత నమ్మకం.. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు నీరుగారిపోయినట్లు అవుతుంది.