ఆంధ్రప్రదేశ్‌లో కరోనాను నియంత్రిస్తున్న విధానం చూసి ప్రపంచ ఆరోగ్య సంస్థ అబ్బురపడిందని… వైరస్‌ను ఎదుర్కోవడంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాలపై ఆరా తీస్తోందని.. వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే హఠాత్తుగా… వ్యూహం మార్చేశారు. ఏపీలో కరోనా పెరుగుతోందని దానికి కారణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్లీపర్ సెల్స్‌గా మారి కరోనాను వ్యాపింపచేయడమేనని.. మంత్రి మోపిదేవి ఏ మాత్రం మొహమాట పడకుండా ఆరోపణలు గుప్పించేశారు. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలే వైరస్‌ను పెంచుతున్నారని ఆయన అనుమానిస్తున్నారు. రాజ్‌భవన్‌లో నలుగురికి వైరస్ సోకింది.దీనిపై టీడీపీ ఆరోపణలు ప్రారంభిస్తోంది. పధ్నాలుగు రోజుల క్రితం.. తమిళనాడు నుంచి కనగరాజ్ వచ్చారని.. ఆ తర్వాత ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వలేదని.. వాదిస్తున్నారు.
ఈ కారణంగా కనగరాజ్ ద్వారానే వైరస్ రాజ్‌భవన్‌లోకి వచ్చిందన్నట్లుగా విమర్శిస్తున్నారు. దీనికి కౌంటర్ ఇవ్వడానికి.. మోపిదేవి.. టీడీపీనే అసలు కరోనా వ్యాప్తి చేస్తోందని విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. మోపిదేవి ఆరోపణలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడం చేతకాక… మతి లేని ఆరోపణలు చేస్తున్నారని.. ప్రజల ప్రాణాలకు ఎలా భరోసా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ.. వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారని తీవ్రమైన విమర్శలు వస్తున్న తరుణంలో.. హఠాత్తుగా.. వైసీపీ ఎదురుదాడి ప్రారంభించినట్లయింది.
టీడీపీ నేతలకు కనీసం సాయం చేసే అవకాశాన్ని కూడా అధికార వర్గాలు ఇవ్వడం లేదు. ఎవరికైనా సాయం చేయాలంటే.. అధికారులకు ఇస్తే వారు పంపిణీ చేస్తారని ముందే చెబుతున్నారు. వైసీపీ నేతలు మాత్రం ఇంటింటికి తిరుగుతున్నారు. ఈ క్రమంలో మోపిదేవి ఆరోపణలతో కొత్త రాజకీయం ప్రారంభమైనట్లే. ఓ వైపు వైరస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటే.. ఈ రాజకీయాలకు మాత్రం.. విరామం లేకుండా పోయింది.