హైదరాబాద్లోని ప్రజాప్రతినిధుల కోర్టులో వరుసగా జరుగుతున్న విచారణల్లో చాలా వరకూ కేసుల్ని కొట్టేస్తున్నారు. కాకపోతే.. అవన్నీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులు. కానీ ఓటుకు నోటు…లిక్కర్ స్కాం లాంటి కేసుల్లో మాత్రం అభియోగాల నమోదు.. సాక్ష్యాల నమోదు చేపడుతున్నారు. లిక్కర్ స్కాంలో సాక్ష్యాలను ప్రజాప్రతినిధుల కోర్టు నమోదు చేసింది. ఈ కారణంగా ఏపీలో కొంత మంది నేతల్లో ఉలికిపాటు ప్రారంభమయింది. దీనికికారణం ఈ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్నది రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణపై.. జగన్ అక్రమాస్తుల కేసే కాదు..మద్యం సిండికేట్ల నుంచి లంచం పుచ్చుకున్న కేసు కూడా విచారణలో ఉంది. వైఎస్ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా మోపిదేవి పని చేశారు. తర్వాత కిరణ్ సీఎం అయిన సమయంలో మద్యం సిండికేట్ వ్యవహారం బయటపడింది. రాజకీయ నాయకులు, ఎక్సైజ్,పోలీస్, మీడియా ఇలా వివిధ వర్గాలవారికి మద్యం సిండికేట్ల నుంచి డబ్బు అందుతోందని ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్ లో ఈ వ్యవహారం బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులకు కిరణ్ ఆదేశించారు. వందమందికిపైగా శాసనసభ్యులు, పది నుంచి ఇరవై మంది మంత్రులు , కొందరు ఎమ్.పిలు, ఎమ్మెల్సీలు ఇలా పార్టీలతో సంబంధం లేకుండా తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అంతా పంచుకున్నారని దర్యాప్తులోవెల్లడైంది.
ఏకంగా అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు మద్యం సిండికేట్ల పంచాయతీ తీర్చి పది లక్షల రూపాయల లంచం తీసుకున్నారని ఏకంగా ఒక నిందితుడు చెప్పారు. అది కోర్టుకు సమర్పించిన రిమాండ్ డైరీలోనే రాశారు. అప్పుడు మోపిదేవి పదవిలోనే ఉన్నారు. అప్పట్లో పీసీసీ చీఫ్ గా బొత్స ఉండేవారు. ఆయన మద్యం సిండికేట్లో కీలకంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన పేరు ఇందులో రాలేదు. తర్వాత మోపిదేవి జగన్ పార్టీలో చేరారు. ఈ కేసుకు సంబంధించి జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్గూడ జైలులో ఉన్న మోపిదేవిని అప్పట్లో ఏసీబీ అధికారులు ప్రశ్నించారు కూడా. 2015లో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు.
ఇప్పుజు లిక్కర్ సిండికేట్ స్కాం కేసులో సాక్షుల నుంచి కోర్టు స్టేట్మెంట్ రికార్డు చేసింది. తదుపరి విచారణ పదిహేనో తేదీకి వాయిదా వేశారు. పదిహేనో తేదీ తర్వాత ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకునే అవకాశం ఉంది.