ఆంధ్రప్రదేశ్ లో 151 ఎమ్మెల్యే ల మెజారిటీ తో అధికారం లోకి వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉండదని, అంతకంటే ముందే ఈ ప్రభుత్వం దిగి పోతుందని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యను వైసీపీ నేత మోపిదేవి ఖండించారు. వివరాల్లోకి వెళితే..
ఎన్టీ రామారావు నిజమైన వారసులు తాము కాదని పార్టీ కార్యకర్తలు ఆయనకు నిజమైన వారసులని బాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు పెరిగాయని, కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని అవసరమైతే ఎక్కడికి కావాలన్నా తాను వస్తానని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అయితే అయిదేళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉండదని ఆ లోగానే ఈ ప్రభుత్వం దిగిపోతుందని బాలకృష్ణ చర్చనీయాంశమైన వ్యాఖ్యలు చేశారు. పూర్తి మెజారిటీ కలిగి స్థిరమైన ప్రభుత్వం గా ఉన్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నిర్దేశిత ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉండగా బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ వ్యాఖ్యలపై ధ్వజ మెత్తారు వైఎస్ఆర్సీపీ నేత మోపిదేవి. బాలకృష్ణ భ్రమల్లో బతుకుతున్నాడు అని, ఎప్పుడెప్పుడు సీఎం కావాలా అని కలలు కంటున్నారని, కానీ చంద్రబాబును వ్యతిరేకించే ధైర్యం , శక్తి ఆయనకు లేదని మోపిదేవి వ్యాఖ్యానించారు. వైయస్సార్సీపి ప్రభుత్వం ప్రజల మన్ననల తో పాలన చేస్తోందని ఆయన అన్నారు.
అయితే ఈ ఇరువురి వ్యాఖ్యల్లో ఉన్న గొప్ప పారడాక్స్ ఏంటంటే, 2015 సంవత్సరంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరో రెండు ఏళ్ళు మాత్రమే ఉంటుంది అంటూ ఆయన కాలపరిమితి కూడా ప్రకటించేశారు. అసలు ఏ ఉద్దేశంతో జగన్ అప్పుడు ఆ వ్యాఖ్యలు చేశారో ఎవరికీ అర్థం కాలేదు.జగన్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ జగన్ బ్రమలో బ్రతుకుతున్నాడు అని అప్పట్లో తెలుగుదేశం నేతలు విమర్శలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా పూర్తి ఐదు సంవత్సరాల కాలం అధికారం కొనసాగించింది. అప్పట్లో అవి భ్రమ లు అని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తే, ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అచ్చం అదే తరహా వ్యాఖ్యలు చేయడం ఒక పారడాక్స్ అయితే, అప్పట్లో జగన్ వ్యాఖ్యలను సమర్థించిన వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు బాలకృష్ణను భ్రమల్లో బతుకుతాడు అనడం ఇంకొక పేరడాక్స్.