ఐదు దశాబ్దాల కల నెరవేరిందని, తెలంగాణ రాష్ట్రం వచ్చిందని రాష్ట్ర ప్రజలంతా సంబరపడ్డారు. రాష్ట్ర సాధన కోసం పద్నాలుగేళ్లుగా ఉద్యమించిన వారు, ఇక మీదట ఆందోళనలు లేకుండా సాఫీగా ప్రగతి పథంలో రాష్ట్రం దూసుకుపోతుందని భావించారు. ఉద్యమ కాలంలో ఎన్ని బంద్ లు జరిగినా, హైవేలను దిబ్బంధించినా, సకల జనుల సమ్మెల జరిగినా, ఆర్టీసీ బస్సులు తిరగక అష్టకష్టాలు పడ్డా ప్రజలు బాధపడలేదు. రాష్ట్ర సాధన కోసం ఇవేమీ కష్టాలు కాదనుకున్నారు. ఉద్యమమే ఊపిరిగా లక్షలాది మంది ప్రజలు ఆందోళనల్లో పాల్గొన్నారు.
వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామనేది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీ. అందుకోసం పలు పథకాలకు ఇప్పటి అంకురార్పణ జరిగింది. సంపన్న రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది. ఇంకా విద్యవైద్యం వ్యవసాయ రంగాలను గాడిలో పెట్టాలి. రైతు ఆత్మహత్యలు జరగని రాష్ట్రంగా మార్చాలి. ఇన్ని పనులున్నాయి. ఈలోగా కొత్త జిల్లాలపై కేసీఆర్ సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. దసరా నాటికి ఎట్టి పరిస్థితుల్లో కొత్త జిల్లాలు అమల్లోకి రావాలని కంకణం కట్టుకున్నట్టుగా సన్నాహాలు చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పెంచుకోవడం కొత్తేమీ కాదు. అయితే కొత్త రాష్ట్రం ఏర్పడగానే జిల్లాలను పెంచడంపై కాకుండా, సమగ్ర ప్రగతిపై దృష్టి పెట్టి, కొన్నేళ్ల తర్వాత జిల్లాల పునర్విభజన చేపడితే మరోలా ఉండేది.
ప్రభుత్వ నిర్ణయం వల్ల మరోసారి అనేక ప్రాంతాల్లో ఆందోళనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా ఏర్పాటులో అన్యాయం జరిగిందని, డివిజన్ గా మా పట్టణాన్ని ప్రకటించాలని, మా ఊరిని మండల కేంద్రం చేయాలని డిమాండ్లు పెరిగే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ బంద్ లు రాస్తారోకోలు కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. వాహనాలు అడుగు కూడా కదలకుండా దిగ్బంధం జరిగింది. తాజాగా వరంగల్ జిల్లా ములుగు జిల్లాను ప్రకటించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. పెద్ద పట్టణాలతో పాటు ములుగు వంటి చోట్ల కూడా జిల్లాగా ప్రకటించాలని ఆందోళన చేయడం ఆశ్చర్యం కలిగించింది.
మెదక్ జిల్లాలో కేసీఆర్ స్వగ్రామం చింతమడకను మండల కేంద్రం చేయాలని ఆ ఊరి ప్రజలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కు కదలివచ్చారు. కేసీఆర్ ను కలిశారు. సరే తన ఊరిని మండల కేంద్రం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలా ప్రతి ఊరికీ హామీ ఇవ్వలేరు. అది అసాధ్యం కూడా. వరంగల్ జిల్లాలోనే జనగాం జిల్లాకోసం ఒత్తిడి చేయడం లేదంటూ తెరాస ఎంపీ ఎమ్మెల్యేలు పరస్పరం విమర్శంచుకుంటున్నారు. కరీంనగర్ సహా అనేక చోట్ల జిల్లా, డివిజన్ ప్రకటన కోసం ఆందోళనలు జరిగాయి.
సకల జనుల సమ్మె సమయంలో దసరా పండుగ వచ్చింది. కానీ తెలంగాణలో బస్సులు బంద్. డిపో దాటలేదు. హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో, జిల్లాల్లో నివసిస్తున్న వారు సొంత ఊరికి పోవడానికి అష్టకష్టాలు పడ్డారు. ప్రయివేటు వాహనాల వారు ఆర్టీసీ చార్జీ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా వసూలు చేసినా అడిగే దిక్కు లేదు. అయినా ప్రజలు బాధ పడలేదు. రాష్ట్ర సాధన కోసం ఇది తప్పదనుకున్నారు. ఇప్పుడు దసరా ముందు కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ముసాయిదాను ప్రకటించి అభ్యంతరాలు తెలపాలని ప్రభుత్వం ప్రజలను కోరుతుంది. అప్పుడు ఆందోళనలతో ప్రజలకు ఇబ్బంది కలగవచ్చు. దసరా సరదాకు అది విఘాతం కలిగిస్తుందా అనేదే ప్రశ్న.