కరోనా వైరస్ విషయంలో ఎంత పారదర్శకంగా ఉంటే ప్రజలు అంత అప్రమత్తంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్టుల సంఖ్యను ఒక్క సారిగా పెంచడంతో పాజిటివ్ కేసులు కూడా అంతే వేగంగా బయటపడుతున్నాయి. ఇరవై నాలుగు గంటల్లో ఏపీ సర్కార్ గత కొద్ది రోజులుగా చేయని విధంగా.. 250 మందికిపైగా కరోనా అనుమానిత టెస్టులు నిర్వహించింది. ఇందులో 34 పాజిటివ్‌గా తేలాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 58. మంగళవారం ఉదయానికి ఈ సంఖ్య 24 మాత్రమే. ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే.. 34 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారిని టెస్టులు చేయడంతోనే ఇలా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా కరోనా అనుమానితుల టెస్టులు చేస్తే.. వారికి వైరస్ సోకే యావరేజ్.. నాలుగైదు శాతంలోపు ఉంటుంది. ఇలా ఉంటేనే చాలా తీవ్రంగా ఉన్నట్లు లెక్క. కానీ మంగళవారం.. పశ్చిమగోదావరి జిల్లాలో 30 మందికి టెస్టులు చేస్తే.. ఏకంగా 14 మందికి పాజిటివ్‌గా తేలింది. కేవలం పది మందికి మాత్రమే నెగెటివ్‌గా తేలింది. మరో ఆరుగురి రిపోర్టులు రావాల్సి ఉంది. అంటే.. యాభై శాతానికిపైగా పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఇది అసాధారణం. ఇంత కాలం… కరోనా అనుమానిత లక్షణాలు తీవ్రంగా ఉంటేనే టెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారందరికీ టెస్టులు చేస్తున్నారు.
ఢిల్లీలో మత సమావేశాల్లో పాల్గొని వచ్చిన వారు హైదరబాద్‌లో ఒక్క రోజే ఆరుగురు చనిపోయారు. ఏపీలోనూ.. ఇలా సమావేశాలకు వెళ్లి వచ్చిన వాళ్లు వెయ్యి మంది వరకూ ఉన్నారు. దీంతో వీరందరి లెక్కలను ప్రభుత్వం బయటకు తీస్తోంది. కరోనా లక్షణాలు.. రెండు,మూడు వారాల వరకు బయటపడవు. కరోనా లక్షణాలు లేవని.. వారు స్వేచ్చగా తిరుగుతూ.. ఇతరులకు వైరస్ వ్యాపింపచేస్తూ ఉంటారు. ఇక్కడే సామాజిక వ్యాప్తి జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా.. శరవేగంగా పరీక్షలు చేయాలన్న సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి.