ఐరోపా యూనియన్ నుంచి విడిపోవాలని యూకే మెజారిటీ ప్రజలు రెఫరెండంలో తీర్పునిచ్చారు. దీంతో త్వరలోనే తెగతెంపులు జరగనున్నాయి. వీలైనంత త్వరగా వెళ్లిపోండని
ఇతర ఐయు సభ్యదేశాలు గ్రేట్ బ్రిటన్ కు అల్టిమేటం ఇచ్చాయి. గెటౌట్ అనకుండానే అన్నంత పనీచేశాయి.
అయితే ఇంతటితో కథ అయిపోలేదంటున్నారు పరిశీలకులు. యూకే బాటలో మరిన్ని దేశాలు యూనియన్ నుంచి బయటకు పోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇ.యు.లో బలమైన దేశం జర్మనీ ఆర్థిక మంత్రే స్వయంగా ఈ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న యూనియన్ విధి విధానాలు వగైరాలను మార్చాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ముఖ్యంగా సభ్యదేశాల మధ్య ఉన్న ఆర్థిక తారతమ్యాలే యూనియన్ పెద్ద మైనస్ పాయింట్ అన్నారు. పరిశీలకుల అభిప్రాయం కూడా అదే.
యూనియన్ లో ఉండటం వల్ల సభ్యదేశాల పౌరులు ఏ దేశానికైనా వెళ్లి రావడానికి ఆటంకాలుండవు. ఉన్నంతలో పేదదేశాల నుంచి యువత సంపన్న దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవచ్చు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. బ్రిటన్ లో ఎగ్జిట్ ఓటుకు ఇదీ ఒక కారణం.
ఇంకో మఖ్యమైన కారణం కూడా ఉంది. అదే సిరియా శరణార్థుల సమస్య. ఐసిస్ ఉగ్రవాదుల అరాచకాలు తట్టుకోలేక లక్షల మంది
సిరియా నుంచి యూరప్ లోకి వలసపోయారు. ఆయా దేశాల్లో ఆశ్రయం కోరారు. జర్మనీ తన సరిహద్దులను బార్లా తెరిచింది. ఇంకా అనేక దేశాలూ యథాశక్తి శరణార్థులకు ఆశ్రయం ఇచ్చాయి. ఇప్పుడు అదే ఆ దేశాలకు గుదిబండగా మారింది. డెన్మార్క్ లో శరణార్థులను పోషించడం కష్టంగా మారింది.
20 వేల మంది శరణార్థులకు భోజనాలు, వైద్య సేవలు ఇతరత్రాల అవసరాలకు ఖర్చు పెట్టడం శక్తికి మించి భారమవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే దేశం దివాళా తీయవచ్చని చాలా మంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే, శరణార్థుల దగ్గరున్న ఖరీదైన వస్తువులు, నగలను స్వాధీనం చేసుకుని వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో తిండిపెట్టాలని డెన్మార్క్ ప్రభుత్వం ఇటీవల ఒక ప్రతిపాదన చేసింది. కానీ విమర్శలు రావడంతో ఆ విధానాన్ని అమలు చేయలేదు.
స్వీడన్, ఇటలీ తదితర దేశాల్లో శరణార్థుల సమస్య తీవ్రంగా ఉంది. ఈ శరణార్థులు కూడా తిన్నగా ఉండకుండా పలుచోట్ల స్థానికులపై దాడికి పాల్పడ్డారు. ఇటీవల గ్రీస్ లో అదే జరిగింది. అలాగే స్థానికు యువతులను వేధించడం వంటి సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. అందుకే శరణార్థులను బయటకు పంపాలనే డిమాండ్ బలపడుతోంది. యూనియన్ లో ఉంటే
జర్మనీ వంటి దేశాల వైఖరివల్ల శరణార్థుల సమస్య పరిష్కారం కాదని ఇప్పటికే ప్రజలు ఓ అభిప్రాయానికి వచ్చారు. ఇ యు నుంచి విడిపోతే సరిహద్దులను మూసేయవచ్చు. శరణార్థులను వెనక్కి పంపవచ్చనే వాదన బలం పుంజుకుంటోంది. శరణార్థుల సమస్య, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి ఇ యు పక్కా పరిష్కార మార్గం చూపక పోతే మరికొన్ని దేశాలు టాటా చెప్పడం ఖాయమంటున్నారు పరిశీలకులు.