ఏపీలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఓ స్థానం ఫలితం రాత్రికే వచ్చేసింది. మరో స్థానం ఫలితం మధ్యాహ్నానికి వచ్చేస్తుంది. ఇక చివరి రౌండ్లు మిగిలి ఉన్నాయి. కానీ తెలంగాణలో జరిగిన ఒక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కౌంటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. చెల్లని ఓట్లను తీసేసి.. మిగిలిన వాట్లను కట్టలు కట్టడానికి ఎన్నికల సిబ్బందికి ఒకటిన్నర రోజు పట్టింది. ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.
సోమవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో… మంగళవారం మధ్యాహ్నానికి ఒక్క రౌండ్ కూడా పూర్తి చేయలేకపోయారు. కట్టలు కట్టిన తర్వాత లెక్కింపు ప్రారంభిస్తారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అర్థరాత్రికి ఫలితం వచ్చే చాన్స్ ఉంది. కౌంటింగ్ విషయంలో సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్లనే ఇలా జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
మరో వైపు రెండు టీచర్ ఎమ్మెల్సీల కౌంటింగ్ పూర్తయింది. విజేతల్ని ప్రకటించారు. అయితే ఆ ఓటింగ్ చాలా స్వల్పం. పాతిక వేల ఓట్లు ఉంటాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీలో మాత్రం రెండున్నర లక్షల వరకూ ఓట్లు పోలయ్యాయి.